విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వాళ్లకు, కులాలు-మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు, రాజకీయాలు చేస్తున్న వాళ్లకు త్వరలోనే గుణపాఠం చెప్పే రోజు వస్తుందని సీఎం జగన్ హెచ్చరించారు.
కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో మాట్లాడిన జగన్.. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస కాండపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమాన్ని, ప్రజల సంతోషాన్ని తట్టుకోలేక.. ఇలా దొంగ దెబ్బ తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
“రాజకీయ దురుద్దేశంతో, అర్థరాత్రి పూట, జనసంచారం లేని గుళ్లలో కావాలనే ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. అలా చేసిన వాళ్లే సోషల్ మీడియాలో దానికి ప్రచారం చేస్తున్నారు.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాళ్లు అదే పనిగా దానికి ప్రచారం కల్పిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి బాగున్నాయి. అంతా బాగా జరుగుతోంది. అందరూ సంతోషంగా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, ఇలా దొంగదెబ్బ తీస్తున్నారు.”
ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ గొరిల్లా వార్ ఫేర్ కొనసాగుతుందన్నారు జగన్. దీన్ని సమర్థంగా ఎదుర్కొంటామని.. కులాలు-మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తున్న వాళ్లకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
“రాజకీయ గొరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖండించాలి, మత సామరస్యం పెంచే విధంగా మాట్లాడాలి. కానీ మతాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతూ, రాజకీయ లబ్ది పొందాలని చూస్తే మాత్రం గుణపాఠం చెబుతాం.”
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో 36వేల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్న జగన్.. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే స్థాయికి వచ్చామంటే, రాజకీయాలు ఎలా దిగజారిపోయాయో అర్థం చేసుకోవాలని కోరారు.
విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్న వాళ్లు ఎవరినైనా ఉపేక్షించొద్దని, చట్టాల్ని కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే అలాంటి వ్యక్తులు ఎవరో సమాజానికి తెలియజేసేలా పబ్లిష్ చేయాలని.. పోలీసులకు పూర్తి పవర్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి.