రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అస్సలు బీజేపీలోనే ఉన్నాడా? ఈ ప్రశ్నకు ఆయన కూడా “అవునని” సమాధానం చెప్పలేడేమో! సహజంగా వ్యాపారవేత్త అయిన టీజీ వెంకటేష్ రాజకీయాలను కూడా వ్యాపార దృష్టితోనే చూస్తారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేసిన టీజీ…రాష్ట్ర విభజన సమయంలో టీడీపీలో చేరాడు. ఆ తర్వాత ఆ పార్టీ తరపున రాజ్యసభ సీటును దక్కించుకున్నాడు. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు టీజీ భరత్‌కు కర్నూలు అసెంబ్లీ సీటును కూడా దక్కించుకున్నాడు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎస్వీ మోహన్‌రెడ్డిని కాదని, భరత్‌కు టీడీపీ సీటు ఇచ్చింది. అయితే భరత్ ఓటమి పాలయ్యాడు.
ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడం, కేంద్రంలో తిరిగి బీజీపీనే అధికారంలోకి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో కూడా మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో టీజీ వెంకటేష్ కూడా ఒకరు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హైదరాబాద్‌లో ఆదివారం (మార్చి 1న) తన పార్టీ వారసుల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారికి విందు ఇచ్చారు. ఈ విందు సమావేశంలో చంద్రబాబు నివాసంలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. ఈ విందుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఆయన సోదరి , ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుమార్తె గౌతు శిరీష, మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, మాగంటి రాంజీ దంపతులు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీళ్లలో ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ఉండడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల కడపలో జరిగిన బీజేపీ విస్తృత సమావేశానికి టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీలు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. వీళ్లలో టీజీ కూడా ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు టీడీపీ వారసుల విందుకు టీజీ భరత్‌కు ఆహ్వానం అందడం, ఆయన వెళ్లడంపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
బీజేపీలోకి నలుగురు రాజ్యసభ సభ్యులను చంద్రబాబే పంపారనే ఆరోపణలకు టీజీ భరత్ వ్యవహార శైలి బలం ఇస్తోంది. ఎందుకంటే తండ్రి వెంకటేష్ బీజేపీలో, కుమారుడు భరత్ టీడీపీలో ఉండటం ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకూ టీజీ కుటుంబం ఏ పార్టీనో కనీసం టీడీపీ, బీజేపీలైనా స్పష్టత ఇస్తే తప్ప తెలియని పరిస్థితి.