ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ మరోసారి నిప్పులు చెరిగారు. అలాగే తన తల్లికి జరిగిన పరాభవంపై లోకేశ్ మొదటిసారి నోరు తెరిచారు. జగన్ ఆకస్మికంగా మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోవడం వెనుక దాగిన రహస్యాన్ని లోకేశ్ బయట పెట్టడం గమనార్హం.
తాడేపల్లిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఇవాళ పర్యటించారు. కోవిడ్‌తో చనిపోయిన కార్యకర్తలు, స్థానికుల ఇళ్లకు లోకేశ్ వెళ్లి పరామర్శించారు. అనంతరం జనంతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని వాపోయారు.
మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణకు, తన తల్లిపై వ్యాఖ్యలకు సంబంధం ఏంటో లోకేశ్ కనిపెట్టి… బయట పెట్టడం చర్చనీయాంశమైంది. తన తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రవేశ పెట్టారని కొత్త సంగతిని లోకేశ్ లోకానికి చాటి చెప్పారు.
సీఎం సొంత జిల్లాలో వరద బాధితులను ఇప్పటి వరకు పరామర్శించలేదని విమర్శించారు. శాసన మండలి రద్దు, ఉపసంహరణపై రోజుకో మాట చెప్పడం సీఎంకు అలవాటుగా మారిందని తప్పు పట్టారు. అందుకే జగన్‌ను ప్రజలు తుగ్లక్ సీఎం అంటున్నారని ఎద్దేవా చేయడం గమనార్హం. ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు చేశారని.. ఏపీలో ఇక్కడ జగన్ చేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనమని లోకేశ్ తప్పు దెప్పి పొడిచారు.