ఒకరేమో.. పార్టీ లేదు, బొక్కా లేదు అంటారు. ఇంకొకరేమో.. ఏకంగా లోకేష్ ను పట్టుకొని ''వాడు-వీడు'' అంటారు. క్రమశిక్షణకు మారుపేరు అని గొప్పలు చెప్పుకునే టీడీపీలో దౌర్భాగ్య పరిస్థితి ఇది. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. తన సొంత పార్టీని కూరలో కరివేపాకు తీసినట్టు తీసి పడేశారు. పార్టీ లేదు బొక్కా లేదు అంటూ వీడియో సాక్షిగా దొరికిపోయారు. అదే టైమ్ లో లోకేష్ ను వాడు-వీడు అనే పదాలతో సంభోధించారు.
అదే సమయంలో అచ్చెన్నాయుడు పక్కన ఉన్న వ్యక్తి మరో రెండు ఎక్కువ తగిలించాడు. వాడికి అంత చేశాను, ఇంత చేశాను అయినా కృతజ్ఞత లేదు అని తిట్టిపోశాడు. లోకేష్ ని తిడుతున్నా అచ్చెన్న కనీసం వారించలేదంటే కడుపుమంట ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లోకేష్ అంటే అందరికీ ఏ స్థాయిలో గౌరవం ఉందో అప్పటి వీడియో క్లియర్ గా చెప్పేసింది.
వాడికి నేను చెప్పలేదు..
ఇప్పుడేమో టీడీపీ కుడిభుజం, చంద్రబాబు ఆప్తమిత్రుడు ఏబీఎన్ రాధాకృష్ణ కూడా లోకేష్ పై అదే పదప్రయోగం వాడారు. వాడి కోసం ఎంత తిరిగాను అంటూ రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో నోరు జారారు రాధాకృష్ణ. గట్టిగా తిప్పమను అన్నా అంటూ ఓ వైపు రేవంత్ రెడ్డి సలహా ఇస్తుంటే.. మరోవైపు ''వాడికి నేను చెప్పను..'' అంటూ తేల్చి పడేశారు ఏబీఎన్ అధినేత.
రాధాకృష్ణకు లోకేష్ తో చనువు ఉండొచ్చు. అరే, ఒరే అని పిలిచేంత దగ్గరి బంధమే కావొచ్చు. అంతమాత్రాన రేవంత్ రెడ్డి ముందు వాడు, వీడు అని మాట్లాడ్డం కరెక్టేనా. అప్పటికీ అమూల్ బేబీ అనే అపనింద పోగొట్టుకోడానికి లోకేష్ గడ్డం పెంచి, తెల్ల వెంట్రుకలకు రంగు వేయకుండా వదిలేసి మెచ్యూర్డ్ లుక్ లోకి మారిపోయారు. అయినా కూడా ఇలా లోకేష్ ని పిల్లాడిలా ట్రీట్ చేయడం రాధాకృష్ణలాంటి వారికి అలవాటుగా మారింది.
టీడీపీని అభిమానించేవారిలో ఏ ఒక్కరికీ లోకేష్ అంటే గౌరవం లేదు. ఓ కార్యకర్త లోకేష్ ను ఎలా తిట్టాలనుకుంటారో, తిడతారో.. పార్టీలో కీలకమైన వ్యక్తులు కూడా చినబాబును అలానే చూస్తున్నారు. సొంత పార్టీలోనే ఇలా ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఎందుకు ఊరుకుంటారు..?
బాబు గారు.. లోకేష్ గాడు..
ఏమాటకామాట చెప్పుకోవాలి.. చంద్రబాబుని సంబోధించేటప్పుడు ఎవరైనా బాబుగారు అని అనడం రివాజు. ఆమధ్య అచ్చెన్నాయుడి వీడియోలో కూడా బాబుగారిని కలిశాను పని కాలేదు, ఈ లోకేష్ గాడు ఇలా చేశాడని అన్నారు సదరు బాధితుడు.
లోకేష్ లేకితనం, చేతగానితనం, పిల్ల చేష్టలు.. పరోక్షంగా చంద్రబాబుపై సింపతీ పెంచుతున్నాయి. బాబుగారు ఈ వయసులో కూడా కష్టపడుతుంటే.. లోకేష్ కి ఇంకా బుర్రపెరగలేదని తిట్టిపోస్తున్నారు.
అచ్చెన్నాయుడు ఎపిసోడ్ ని జనం మరచిపోయారనుకునేలోపే.. ఏబీఎన్ రాదాకృష్ణ.. వాడు వీడు అంటూ లోకేష్ పరువు మరోసారి బజారునపడేశారు. పాపం పార్టీలో లోకేష్ పరిస్థితి ఇలా మారిపోయింది.