రాజకీయ నాయకుల కంటే రాజకీయ వ్యూహకర్తలకు క్రేజ్ పెరిగిపోతున్న రోజులివి. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ విజయం కంటే, బీజేపీని ఓడించడానికి ప్రశాంక్ కిషోర్ పన్నిన వ్యూహాలకే ఎక్కువ ప్రచారం లభించింది. ఒక్క బెంగాల్ లోనే కాదు, చాలా రాష్ట్రాల్లో పీకే టీమ్ విజయాలను అందించే పనిని విజయవంతంగా పూర్తి చేసింది.
తెలంగాణలో కొత్తగా రాజకీయ అడుగులు వేస్తున్న షర్మిలకు కూడా వ్యూహకర్త అవసరం బాగా ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ని ఎదుర్కొని బలంగా నిలబడాలంటే తెలంగాణలో వ్యూహాలకు పదును పెట్టాల్సిందే. ఆషామాషీ వ్యూహాలతో వెళ్తే ఎదురుదెబ్బలు తప్పవు. అందుకే ప్రశాంత్ కిషోర్ తోటే షర్మిల టీమ్ మంతనాలు జరిపింది.
వాస్తవానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ప్రధాని నరేంద్ర మోదీ. మోదీని గద్దె దించేందుకు, దేశంలోని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పీకే. థర్డ్ ఫ్రంట్ పేరుతో బీజేపీకి వణుకు పుట్టిస్తున్నారు. ఈ దశలో ఆయన ప్రాంతీయ రాజకీయాల జోలికి రాలేనని తెగేసి చెప్పారు. తన బదులుగా, తన శిష్యురాలు ప్రియను షర్మిలకు అటాచ్ చేశారు.
ప్రియ టాలెంట్ ఏంటి..?
తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తెగా ప్రియ అందరికీ సుపరిచితురాలే. తమిళనాడులో ఆమె ఓ మీడియా సంస్థకు అధినేత కూడా. అయితే ప్రియ టాలెంట్ ఏంటో ఇంకా చాలామందికి తెలియదు. గతంలో పీకే టీమ్ లో ఈమె చాలా చురుగ్గా పనిచేశారు. పీకే తర్వాత ఆ టీమ్ లో అంతటి సమర్థురాలు ప్రియేనని అంటారు.
అలాంటి చురుకైన ప్రియ, ఇప్పుడు షర్మిలకు అండగా ఉండబోతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ టీమ్ పేరుతో హడావిడి మొదలైంది. పార్టీ పేరు ప్రకటనకి ముందే వెబ్ సైట్, సహా ఇతర సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచారం షురూ అయింది. దీనింతటికీ ప్రియ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేసి ఇచ్చారట.
తెలంగాణలో షర్మిలకు సపోర్ట్ చేసే మీడియా ఏది..?
తెలంగాణలో దాదాపు మీడియా అంతా కేసీఆర్ కి అనుకూలంగానే ఉంది. వెలుగు, వి-6 మాత్రం ప్రతిపక్షం స్టాండ్ తీసుకున్నాయి. ఈ దశలో అసలు షర్మిలను అక్కడ ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఆమెను హైలెట్ చేస్తారనేదే సమస్య. దీని కోసం ఓ కొత్త న్యూస్ ఛానెల్ తో ప్రియ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
కేవలం సోషల్ మీడియానే నమ్ముకోకుండా ఓ ఛానెల్, మరో న్యూస్ పేపర్ మద్దతు కూడా తీసుకోబోతున్నారట. మొత్తమ్మీద పార్టీ పేరు ప్రకటించడాని కంటే ముందే షర్మిల, ఆమెతో పాటు ప్రియ బాగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని అర్థమవుతోంది.
టీఆర్ఎస్ కో, బీజేపీ కో బి-టీమ్ షర్మిల అనే అపవాదుని ముందుగా వారు తొలగించుకోవాలి. అప్పుడే షర్మిలను తెలంగాణ ప్రజలు నమ్మగలుగుతారు. ఎవరి రాజకీయ లబ్ధి కోసమో షర్మిల పార్టీ పెట్టిందనే అనుమానాలు మొదలైతే మాత్రం ఓటు బ్యాంకు సాధించడం కష్టంగా మారుతుంది.