మూఢనమ్మకాలతో తమ పిల్లలను బలిపెట్టిన మదనపల్లెకు చెందిన లెక్చరర్ పురుషోత్తమ్ నాయుడు, ఆయన భార్య పద్మజలను జైలుకు తరలించారు పోలీసులు. వారిని కోర్టు ముందు హాజరు పరిచిన పోలీసులు న్యాయమూర్తి ఆదేశాలనుసారం జైలుకు తరలించారు.
కోర్టుకు తీసుకెళ్లనంత వరకూ వారిని ఇంట్లోనే ఉంచి విచారించారు పోలీసులు. ఆ విచారణలో విస్మయకరమైన విషయాలు బయటకు వచ్చాయి. వారి మూఢనమ్మకాలకు సంబంధించిన షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
చిన్న కూతురుకు దెయ్యం పట్టిందని ఆమె తల్లి, పెద్ద కూతురు బలంగా ఫిక్సయ్యారు. తండ్రి కూడా వారి ప్రభావానికి లోనయ్యాడు. దెయ్యాన్ని వదిలించాలంటే చిన్న కూతురును చంపడమే మార్గమని వారు నమ్మారు. విచిత్రమైన పూజలు చేసి ముందుగా చిన్నమ్మాయిని చంపారు. ఆ తర్వాత తనను చంపాలంటూ పెద్ద కూతురు తల్లిదండ్రులను ఆదేశించిందని పోలీసుల విచారణలో బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ మూర్ఖత్వ మూఢ విశ్వాసంతో సమాజానికే షాకిచ్చిన ఈ దంపతుల్లో ఇంకా ఒకరు ఆ ట్రాన్స్ నుంచి పూర్తిగా బయటకు రాలేదనే విషయం కూడా వార్తల్లో నిలుస్తూ ఉంది. నిందితురాలు పద్మజకు పోలీసులు కరోనా పరీక్ష చేయించబోగా.. ఆమె స్పందించిన తీరు ఆమె మానసిక స్థితిని చాటుతూ ఉంది.
వీరి పరిస్థితి పై మానసిక వైద్యులు స్పందిస్తూ.. వారు సాధారణ ఆధ్యాత్మికతకు మించి, ఒక ట్రాన్స్ లోకి వెళ్లారని, వారికి సరైన చికిత్స అందిస్తే మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావొచ్చని కూడా చెబుతున్నారు. అయితే.. వారు ఇప్పటికే ఆ ట్రాన్స్ లో తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డారు.
పద్మజ మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జైల్లో ఆమెను ప్రత్యేక గదిలో ఉంచారట. పురుషోత్తమ్ నాయుడును మాత్రం సాధారణ రిమాండ్ ఖైదీలతో ఉంచినట్టుగా పోలీసులు తెలిపారు.