ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగినా కొంత శాతం మేర ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. అందుకు స్థానికంగా బోలెడన్ని కారణాలు ఉండవచ్చు. మామూలుగా అయితే ఏపీలో ఎక్కడకు వెళ్లినా రాజకీయంగా ఢీ అంటే ఢీ అనే పరిస్థితే ఉంటుంది. అయితే అరుదుగా మాత్రమే రాజకీయ ప్రశాంతత ఉండే ప్రాంతాలుంటాయి.
స్థానిక ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఒకే పార్టీలో రెండు మూడు వర్గాలు పుట్టుకొస్తూ ఉంటాయి. పాత కక్షలూ, రచ్చలు రేగుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఉండే రాష్ట్రంలో.. అరుదుగా అయినా కొన్ని ఏకగ్రీవాలు ఉండనే ఉంటాయి.
ఎవరి హయాంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పటికీ కొన్నైనా ఏకగ్రీవాలు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో చివరి సారి స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. అంతకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్న సందర్భంలో స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఏకగ్రీవాలు కొన్నైనా నమోదయ్యాయి.
దీన్ని బట్టి చూడాల్సింది ఏమిటంటే.. ఏకగ్రీవాలు అంటే అవి కేవలం బలవంతంగా జరిగేవి కావు అనేది. ఇలాంటి రాజకీయ పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు అంటే కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది బుగ్గలు నొక్కుకుంటూ ఉన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ అయితే ఏకగ్రీవాలను పూర్తిగా రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది.
చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఏకగ్రీవాలకు వ్యతిరేకంగానే మాట్లాడారు! వీళ్ల వాదననే కాసేపు పరిగణనలోకి తీసుకున్నా.. ఏకగ్రీవాల శాతం అంటూ ఒకటి ఉంటుంది. గతంలో స్థానిక ఎన్నికల సందర్భాలు జరిగినప్పుడు ఎంత శాతం ఏకగ్రీవాలు చోటు చేసుకున్నాయి, ఇప్పుడు ఎన్ని ఏకగ్రీవం అవుతున్నాయి.. అనే అంశాలను పరిశీలిస్తే.. వీరి వాదనల్లోని డొల్లతనం బయటపడుతుంది.
ఏకగ్రీవాలు ఇప్పుడే కొత్తగా జరగడం లేదని, వాటి శాతం ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుందనే స్పష్టత వస్తుంది. పొడిచేందుకు చేతగాక.. ఏకగ్రీవాల మీద పడి ఏడవడం ఏపీలో ప్రతిపక్ష పార్టీల చేతగాని తనాన్ని చాటుతోంది.