ఆ మధ్య హిందీలో ఒక సినిమా వచ్చింది ధడక్ అని, మరాఠా సినిమా సైరట్ కు రీమేక్ సినిమా అది. ఉత్తరాదిన తీవ్ర స్థాయిలో జరిగిన పరువు హత్యల నేపథ్యంలో ఆ సినిమాను రూపొందించారు. ఆ సినిమా క్లైమాక్స్ చూస్తే.. తల తిరుగుతుంది. అంతకు మించి దారుణమైన కథ లో పావులయ్యింది మారుతిరావు కుటుంబం.
ప్రతిష్టకుపోయి.. పరువే ప్రాణం అనుకుని.. చివరకు తన ప్రాణాలనే తను తీసుకోవాల్సి వచ్చింది మారుతిరావు. తన కూతురు తమ కన్నా తక్కువ కులం వాడిని పెళ్లి చేసుకుందనే విషయంలో మారుతిరావు దారుణానికి ఒడికట్టించారనే కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రణయ్ హత్య సమయంలో.. సోషల్ మీడియాలో మారుతిరావును సమర్థించిన వారూ ఉన్నారు! మరి ఇప్పుడు వాళ్లేమంటారు? మారుతిరావు చేయించింది అప్పుడు కొంతమందికి సమంజసంగానే అనిపించింది, మరి ఇప్పుడే అదే మారుతిరావు జరిగిన పరిణామాలకు తట్టుకోలేక తనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆయన పశ్చాతాపం అని అంటోంది ఆయన కూతురు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు ఏం మిగుల్చుకున్నారు? తన కూతురుకు ప్రేమించిన వాడిని లేకుండా చేశాడు, అలా అప్పటికే తనకు దూరం అయిన కూతురును మరింత దూరం చేసుకున్నాడు. ఇప్పుడు తనూ తనువు చాలించాడు.
ఎన్నో ప్రేమ పెళ్లిళ్లు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. వాటిల్లో కొన్ని కులాంతర వివాహాలూ ఉంటున్నాయి. కొన్ని చోట్ల పెద్దలు రాజీ పడుతున్నారు. ప్రేమ అంటూ ఎదిగిన పిల్లలు వచ్చి చెబితే, కొందరు నచ్చకపోయినా పిల్లల కోసమంటూ ఆమోదిస్తూ ఉన్నారు. మరి కొందరు కూతుళ్లతో బంధాన్ని తెంచేసుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని కొన్ని ఘటనలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి.
ఇద్దరు కూతుళ్లూ తమ మాట వినకుండా, వేరే కులం వాళ్లను ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారని.. తమలో తాము కుమిలిపోయి కొన్నేళ్ల కిందట ఏపీలోనే ఒక భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు. కూతుళ్లను, అల్లుళ్లను ఏం చేయలేక వారు తమ ప్రాణాలను తీసుకున్నారు. మారుతీరావు అందుకు భిన్నంగా కర్కశమైన పని చేయించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. అయితే జరిగినదాన్ని మార్చలేమని కూతురు, అల్లుడి విషయంలో కాస్త ఓపికగా ఉండి ఉంటే.. వీళ్ల గురించి మాట్లాడుకునేదే ఉండకపోయేదేమో!