యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా తెలంగాణాకు చెందిన రామప్ప దేవాలయాన్ని గుర్తించింది. దాంతో ఏపీలో ఉన్న వారసత్వ కట్టడాలు కూడా ఇపుడు పోటీకి దిగుతున్నాయి. అందులో అందరికీ ఆకట్టుకుంటున్న గొప్ప ఆలయం సింహాచలం. ఈ నారసింహ క్షేత్రానిది వెయేళ్ళ చరిత్ర. 11వ శతాబ్దంలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది.
దానికి సంబంధించిన శాసనాలు, చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. పురాతన పుస్తకాలు డాక్యుమెంట్లను ఇపుడు దేవస్థానం సేకరిస్తోంది. ఈ ఆలయ శిల్ప సౌందర్యం, కట్టడాలు కూడా ప్రపంచ వారసత్వ సంపదగా చూడాలని ఈవో సూర్యకళ కోరుతున్నారు.
ఈ ఆలయం గత సహస్రాబ్దిగా దేశంలోని ప్రజలను విశేషంగా అలరిస్తోందని, ఆధ్యాత్మిక భావనలను అంతటా పంచిపెడుతోందని ఆమె అంటున్నారు. మహా ఏలిక శ్రీక్రిష్ణ దేవరాయల నుంచి గజపతుల వరకూ ఎంతో మంది ఈ ఆలయన్ని దర్శించుకుని చేసిన సేవలకు మేలు గురుతులు ఉన్నాయని కూడా చెబుతున్నారు.
ఈ శాసనలకు సంబంధించిన సమాచారాన్ని వెలికి తీసేందుకు ఆంధ్రా యూనివర్శిటీ కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు విసృతమైన పరిశోధనలు జరిపించి పూర్తి వివరాలను యునెస్కో వారికి పంపుతామని అంటున్నారు. మొత్తానికి ఈ ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందితే అది దేశానికే గర్వకారణం అని ఆస్తికజనులు అంటున్నారు.