విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. తాడో పేడో తేల్చేస్తామంటూ ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. గోడకు కొట్టిన బంతిలా రిటర్న్ అయ్యారు. డైరెక్ట్ గా మోదీ తోటే భేటీ అవుతారు. ఆయనకే మెమొరాండం ఇస్తారు, ఉక్కు సంకల్పం పట్టారంటూ ఇక్కడ జనసేన నాయకులు హడావిడి చేసినా అక్కడ మాత్రం పవన్ కి మోదీ దర్శన భాగ్యం దొరకలేదు.
పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవడం రివాజు. అంతకు మించి ఆయన ఇంకెరినీ కలవరు. వాళ్లెవరూ పవన్ ని కలిసేందుకు ఇష్టపడరని కూడా బయట టాక్.
ఆ విషయాలు ఎలా ఉన్నా.. కనీసం ఈసారైనా ప్రధాని మోదీతో పవన్ భేటీ అవుతారని అనుకున్నారు. అది కుదరకపోవడంతో అమిత్ షా ని, కిషన్ రెడ్డిని కలసి మమ అనిపించారు పవన్. ఇంతవరకు బాగానే ఉంది.
ప్రధాని మోదీ బాగా బిజీగా ఉండటం వల్ల మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడికి అపాయింట్ మెంట్ దొరకలేదేమో అనుకుందాం. అయితే ఆ తర్వాత రెండు రోజులకే, వైసీపీ టికెట్ పై గెలిచిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని మోదీతో భేటీ కావడం అందరికీ ఆశ్చర్యంగా తోచింది.
మరి పవన్ కి దక్కని మోదీ దర్శనభాగ్యం, రఘురామకు ఎలా దక్కినట్టు. మిత్రపక్ష పార్టీ అధ్యక్షుడిని కలిసే తీరికలేని మోదీ.. వైసీపీ ఎంపీకి ఎందుకంత సమయం ఇచ్చినట్టు. ఇక్కడ పవన్ ని కలవడం మోదీకి ఇష్టంలేదా? లేక పవన్ స్థాయి వ్యక్తిని మోదీ వరకు ఆపార్టీ నేతలు వెళ్లనివ్వలేదా?
తిరుపతి ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమే గగనం అవుతున్న పరిస్థితుల్లో ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై పవన్ డిమాండ్ కి కేంద్రం తలొగ్గుతుందంటే ఎవరూ నమ్మరు. అయితే పవన్ తరపు నుంచి డ్రామా రక్తికట్టించాలంటే ప్రధాని నరేంద్రమోదీకి మెమొరాండం ఇవ్వడం, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పడం వంటి ఘట్టాలు జరిగి ఉండాలి. కానీ పవన్ అంచనా తారుమారైంది.
వ్యవసాయ చట్టాల వ్యవహారంలో నిప్పుల కొలిమిపై కూర్చుని ఉన్న స్టేజ్ లో కూడా ప్రధాని మోదీ రైతులకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. తన తరపున మంత్రుల బృందాన్ని చర్చలకు పంపిస్తారే కానీ, నేరుగా తాను మాత్రం హాజరు కారు. అలాంటి మోదీ.. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న విశాఖ ఉక్కు విషయాన్ని సీరియస్ గా తీసుకుంటారని ఎవరూ ఊహించరు.
అందులోనూ పవన్ కల్యాణ్ ని కలవడం వల్ల మోదీకి ఎలాంటి ఉపయోగం కూడా లేదు. తెలంగాణ ఉప ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో.. ఏపీలో జనసేనను బీజేపీ చిన్నచూపు చూడటం మొదలు పెట్టింది.
అసలు జనసేన అవసరం లేకపోయినా బీజేపీ ఏపీలో బలపడుతుందనేది వారి ఆలోచన. అందుకే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల విషయంలో కూడా జనసేనను లెక్కలో వేసుకోవడం లేదు. దీంతో సహజంగానే హైకమాండ్ పవన్ కి ప్రయారిటీ తగ్గించేసింది. అందుకే జనసేనానికి ప్రధాని అపాయింట్ మెంట్ దొరకలేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
దీంతో నేరుగా వచ్చి సినిమా షూటింగ్ కి హాజరయ్యారు పవన్. ఉక్కు దీక్ష, ఉక్కు సంకల్పం అంటూ ఢిల్లీలో హడావిడి చేసి, మోదీతో ఫొటో దిగి.. నేరుగా వైజాగ్ వచ్చి తన ప్రతాపం చూపాలనుకున్న పవన్.. ఆ పాచిక పారకపోవడంతో సైలెంట్ గా హైదరాబాద్ లో ల్యాండ్ అయి సినిమా డైలాగులు బట్టీపడుతున్నారు.