తాము తెచ్చిన వ్యవసాయ చట్టాలపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ విషయంలో మరోసారి స్పందించిన మోడీ రైతులను మిస్ గైడెడ్ గా అభివర్ణించారు. రైతులను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ మోడీ యథావిధిగా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలను అందుకున్నారు. అది కూడా మమతా బెనర్జీ మీద ధ్వజమెత్తుతూ.. బెంగాల్ ఎన్నికల ప్రసంగాన్ని చేశారు మోడీ.
ఒకవైపు రైతుల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. రోజులు, వారాల తరబడి ఢిల్లీలోని అతి చల్లటి, పొగ నిండిన వాతావరణంలో రైతుల ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ పలు దఫాలుగా రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు సంప్రదింపులు జరిపారు. అయితే అవి ఫలప్రదం కాలేదు.
వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని రైతులు స్పష్టంగా చేస్తున్నారు. వాటివల్ల ప్రయోజనం లేదని పంజాబ్, హర్యానా రైతుల నుంచి నిరసన వ్యక్తం అవుతూ ఉంది.
అయితే తాము తెచ్చిన చట్టాలు చాలా గొప్పవని, వాటి వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్రం వాదిస్తోంది. అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పటి వరకూ రైతు సంఘాల నేతలకు వివరించి చెప్పలేకపోతున్నారు కేంద్రమంత్రులు.
మరి నిజంగానే ప్రయోజనాలు ఉంటే.. వాటిని రైతు సంఘాల ప్రతినిధులకు వివరించి చెప్పి ఆందోళన చేస్తున్న రైతులను సమాధాన పరచవచ్చు కదా! మరి రైతు సంఘాల వాళ్లకు ఎందుకు కేంద్రం సర్ధిచెప్పలేకపోతోందో!
అలాగే ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీలేవీ మధ్యవర్తిత్వాన్ని నెరపడం లేదు. రైతు సంఘాల ప్రతినిధులే మాట్లాడుతున్నారు. కానీ.. ఇప్పుడు కేంద్రం ప్రతి పక్ష పార్టీలపై దుమ్మెత్తి పోస్తోంది. మమతా బెనర్జీపై మోడీ దుమ్మెత్తి పోశారు. అయితే అసలు సమస్యకూ, ఈ రాజకీయ విమర్శలకూ సంబంధం లేదేమో!
అయితే మోడీ ఒక్కటి మాత్రం స్పష్టం చేస్తున్నారు వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడం ఉండదని. ఈ విషయంలో కొన్ని సవరణలకు రెడీ కానీ తాము తెచ్చిన చట్టాలను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని మోడీ స్పష్టంగానే చెబుతున్నారు.