ట్విట్టర్ ను టేకోవర్ చేసినప్పట్నుంచి ఎలాన్ మస్క్, దానితో ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్టు మార్పుచేర్పులు చేస్తున్నాడు. చివరికి బ్లూ బర్డ్ లోగోను కూడా తొలిగించేశాడు. ఇక బ్లూ బర్డ్ అనేది చరిత్రలో కలిసిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అది జరిగిన 3 రోజులకే తిరిగి పక్షి బొమ్మ ట్విట్టర్ లోగోగా మారిపోయింది. దీంతో నెటిజన్లు మస్క్ ను చూసి నవ్వుకుంటున్నారు.
బ్లూ బర్డ్ ను తీసేసి దాని స్థానంలో డోజ్ కాయిన్ సింబల్ ను పెట్టాడు మస్క్. ఇకపై ట్విట్టర్ లోగో ఇదేనంటూ పరోక్షంగా సంకేతాలు కూడా ఇచ్చాడు. కట్ చేస్తే, 3 రోజులకే తిరిగి పాత లోగోను పునరుద్ధరించాడు ఈ కొత్త ట్విట్టర్ బాస్.
మస్క్ ఇలా చేయడాన్ని నిపుణులు వ్యాపార ఎత్తుగడగా భావిస్తున్నారు. డోజ్ కాయిన్ లో మస్క్ భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఎప్పుడైతే ట్విట్టర్ ఒరిజినల్ లోగోను తీసేసి, ఆ స్థానంలో డోజ్ సింబల్ ను పెట్టాడో, ఆ వెంటనే డోజ్ కాయిన్ షేర్ విలువ 22 శాతం పెరిగింది.
కేవలం ఈ పెంపు కోసమే మస్క్ ఈ పని చేశాడని, తను అనుకున్నది సాధించడంతో, తిరిగి పాత లోగోను పునరుద్ధరించాడని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లీగల్ అడ్వైజర్లు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.
డోజ్ కాయిన్ పై భారీగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు మస్క్ కు వ్యతిరేకంగా భారీ పరిహారం కోరుతూ మన్ హట్టన్ కోర్టులో కేసు వేశారు. వాళ్ల దృష్టి మరల్చేందుకు మస్క్ ఇలా లోగో మార్చి మస్కా కొట్టి ఉంటాడనే వాదన కూడా వినిపిస్తోంది.
కారణాలు ఏమైనా ట్విట్టర్ పక్షి మళ్లీ సొంత గూటికి చేరింది. ఈ కంపెనీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు వినియోగదారులపై ఛార్జీల భారం మోపాడు మస్క్.