పుష్ప సినిమా సీక్వెల్ ‘పుష్ప గాడి రూలు’ నుంచి చిన్న శాంపిల్ వీడియోను విడుదల చేసారు. వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ చిన్న ఇంట్రస్ట్ డెవలప్ చేస్తూ కర్టెన్ రైజర్ వీడియో ఇచ్చి ఆపై వదిలిన వీడియో చిత్రంగా వుంది. పుష్ప అనే సినిమా ఎందుకు జనాలకు పట్టింది..ఎలా పట్టింది అనే డిస్కషన్లలో కొత్త నేపథ్యం అనేది కీలకం. శేషాచలం అడవులు, ఎర్రచందనం స్మగ్లింగ్ అనేవి ప్రేక్షకులకు కొత్త పాయింట్..కొత్త అనుభవం. కొత్త కొత్త పాత్రలు ఇంకా కొత్త అనుభవం.
అటవీ ఆఫీసర్ తో పుష్ప ఢీ అంటే ఢీ అనడం తో తొలిభాగం ముగిసింది. అదే లైన్ లో మలిభాగం కూడా ముందుకు వెళ్తుందని అంతా అనుకుంటున్నారు.వేర్ ఈజ్ పుష్ప అంటూ వదిలిన చిన్న బిట్ లో కూడా పుష్ప బుల్లెట్ గాయాలు తగిలి, తిరుపతి జైలు నుంచి తప్పించుకున్నాడు అంటే కథ అదే లైన్ లో వెళ్తోంది మళ్లీ అని అనుకున్నారు.
కానీ ఫుల్ వీడియో వచ్చి ఆ ఇంట్రస్ట్ ను చంపేసింది. చాలా అంటే చాలా సినిమాల్లో, ఇంకా చెప్పాలంటే శంకర్ జంటిల్ మన్ లో మాదిరిగా హీరోను రాబిన్ హుడ్ గా చూపించే ప్రయత్నమే చేసారు. పుష్ప ఎర్రచందనం స్మగ్లర్ గా నేరం చేయడం లేదు. అలా సంపాదించిన డబ్బును పేదలకు పంచేస్తూ హీరో అవుతున్నాడు. అయ్యాడు అని చెప్పడానికి వాడుకున్నారు.
పుష్ప ఏమయ్యాడు. పుష్ప మద్దతు దారులు ఎలా తిరగబడ్డారు. పుష్ప జనాలను ఆదుకునేవాడు అని ఎలా చెప్పారు..పుష్ప కోసం గాలింపు సీన్లు ఇవేవీ తెలుగు తెరకు కొత్త కాదు. సుకుమార్ కూడా కొత్తగా విజవల్స్ ఏమీ చూపించలేదు.
పులుల కోసం ఏర్పాటు చేసిన నైట్ కెమేరాలో పుష్ప జాడ తెలిసిన తీరు ఒక్కటే కొత్తగా వుంది. పులి కూడా పుష్ప ను చూసి అడుగు వెనకేసిందన్నది ఒక్కటే కొత్త పాయింట్. మిగిలినదంతా పాతకాలపు రొట్టే. సుకుమార్ ఇలాంటి దానిలో పుష్ప ను తీసుకెళ్తారని ఊహించడం కష్టం. ఇదీ పుష్ప గాడి రూలు..అంతే.