హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలయ్యను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడుకుంటున్నారు. సినిమా డైలాగ్‌లో చెప్పాలంటే…దబిడి దబిడే అన్న మాట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగుతున్న లోకేశ్ పాదయాత్రలో బాలయ్య పాల్గొన్నారు. మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సైకోకు వ్యతిరేకంగా ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.
అలాగే కొన్ని ఆణిముత్యాల్లాంటి మాటలు ఆయన నోటి నుంచి రాలాయి. వాటిపై నెటిజన్లు తమదైన సృజనాత్మక శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఆ మాటల ఆణిముత్యాలేంటో తెలుసుకుందాం.
“నన్ను మించిన సైకాలజిస్ట్ లేడు”.. “చంద్రబాబు తెలుగువారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తెచ్చారు”
సైకాలజీ చదవలేదు కానీ, తాను సైకాలజిస్ట్ అని బాలయ్య చెప్పుకోవడంపై నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. “ఔను, కేసు భయంతో తీసుకున్న డాక్టర్ సర్టిఫికెట్ ఉంది కదా!” అంటూ సెటైర్స్ విసురుతూ పాత విషయాల్ని తోడుతున్నారు. గతంలో బాలయ్య ఇంట్లో కాల్పులకు దారి తీసిన పరిస్థితుల గురించి అందరికీ తెలిసినవే. మతిస్థిమితం సరిగా లేదని సర్టిఫికెట్ తీసుకుని, హత్యాయత్నం కేసు నుంచి బాలయ్య అతి కష్టమ్మీద బయట పడ్డారు. పైగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దయ తోడు కావడం బాలయ్య అదృష్టం.
చంద్రబాబు తెలుగువారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తెచ్చారు అని చెప్పడంపై కూడా నెటిజన్లు వెటకరిస్తున్నారు. “బోటనీ, జువాలజీ , ఫిజిక్స్ , కెమిస్ట్రీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం పరంగా కూడా ఆయన మమ్మల్ని అభివృద్ధి లోకి తెచ్చాడని చెప్పడం మీరు మర్చిపోయారు, సర్ ! అంతేకాదండోయ్, అతి ముఖ్యమైన నటన కూడా చంద్రబాబు వల్లే రాణించామని చెప్పడం ఎలా మరిచారు” అంటూ నెటిజన్లు వాయించేస్తున్నారు.
అప్పుడప్పుడు బాలయ్య మీడియా ముందుకొచ్చి, తన ఉనికి చాటుకునేందుకు ఏవో మాట్లాడుతుంటారు. అసలే ఎన్నికల సీజన్. ప్రత్యర్థుల కోసం ఎదురు చూస్తున్న నెటిజన్లు ఊరుకోరు కదా! తమదైన రీతిలో చీల్చి చెండాడుతున్నారు.