ఆంధ్రప్రదేశ్‌లో పసందైన రాజకీయం నడుస్తోంది. ఎన్నికలకు రోజులు శరవేగంగా వస్తున్నాయి. కళ్లు తెరిచి మూసే లోపు కాలం కరిగిపోతోంది. మరోవైపు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సీరియస్‌గా సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ‘జగనన్నే మా భవిష్యత్’ అనే పేరుతో కొత్త కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ సందర్భంగా జనసేనాని పవన్‌కల్యాణ్‌పై ప్రజల్లో నమ్మకానికి సంబంధించి మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నగరి నియోజక వర్గంలోని పూడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న రోజా మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ను జనం నమ్మరు గాక నమ్మరని తెగేసి చెప్పారు. పవన్‌పై జనంలో అసలు నమ్మకం లేదన్నారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్‌కల్యాణ్ తనతో పాటు జగన్‌ను ఓడిస్తాననడం అవివేకమన్నారు.
చంద్రబాబు, పవన్‌లకు కలవాలని మనసులో ఉంటే ఎవరూ అడ్డుకోలేరన్నారు. పార్టీ పెట్టిన పవన్‌కల్యాణ్ ఏం చేస్తున్నారని రోజా నిలదీశారు. చంద్రబాబు మాదిరిగా మ్యానిఫెస్టోను వెబ్‌సైట్ నుంచి తాము తీసేయలేదని దెప్పి పొడిచారు. పదేపదే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్‌కల్యాణ్ అంటున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని పవన్ తరచూ శపథాలు చేస్తుంటారు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌నే టార్గెట్ చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
2014లో కూడా జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకునేందుకే టీడీపీ, బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ఇచ్చానని చెప్పారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్‌కల్యాణ్ విడిగా పోటీ చేసి, చివరికి తనను తాను కూడా ఓడించుకున్న గొప్ప త్యాగశీలి పవన్‌కల్యాణ్. అందుకే రాజకీయంగా పవన్ విశ్వసనీయ సంపాదించలేకున్నారు. పవన్ వైఖరిపై వైసీపీ ఓ రేంజ్‌లో చాకిరేవు పెడుతోంది. మరీ ముఖ్యంగా రోజా ఆడుకుంటున్నారని చెప్పాలి.