అమెరికా అధ్యక్ష హోదాలో ఆది నుంచి సంచలనాలకు, ప్రపంచానికి ఆశ్చార్యాలను కలిగించే మాటలు, నిర్ణయాలతో అందరికీ సుపరిచితుడిగా మారిన డొనాల్డ్ ట్రంప్ ఈ పర్యాయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి ప్రభావం గురించి సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. చైనా నుంచి దిగుమతులపై భారీ టారీఫ్ ను విధిస్తూ.. అటు చైనాకూ, ఇటు అమెరికన్ కంపెనీలకూ నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాడు ట్రంప్. చైనా ఏమో కౌంటర్లు మొదలు పెట్టింది. అమెరికా టారీఫ్ లు విధించగానే చైనా కలవరపడటం లేదు బయటకు అయితే! చైనా ప్రధానంగా ఎగుమతుల మీదే ఆధారపడి ఉంది. అయితే అమెరికా టారీఫ్ లకు బెంబేలెత్తిపోవడం లేదు. ట్రంప్ రగిల్చిన మంట ప్రభావంతో అమెరికాలోనే అగ్గిపుడుతుందని, అప్పుడు మళ్లీ తామే దిక్కవుతామని చైనా భావిస్తున్నట్టుగా ఉంది. అమెరికా విధించిన టారీఫ్ ల కన్నా ఒక శాతం ఎక్కువ టారిఫ్ నే విధిస్తోంది చైనా.
మరోవైపు ఇప్పటి వరకూ మార్కెట్ లో లీడర్లుగా ఉన్న అమెరికన్ కంపెనీలు ట్రంప్ లు విధించిన దిగుమతి సుంకాల కారణంగా తమ పట్టును కోల్పోతాయా.. అనే ప్రశ్న కూడా ఒకటి మిగిలే ఉంది! చైనాలో తయారయ్యే ఎన్నో వస్తువులను అమెరికన్ సంస్థలు తమ ముద్రను వేసి అమ్ముకుంటూ ప్రపంచంలోనే టాప్ టెక్ ధిగ్గజ సంస్థలుగా చలామణిలో ఉన్నాయి. ఇప్పుడు దిగుమతి సుంకాల ఫలితాలు ఆ సంస్థలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయనేది కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఈ దిగుమతి సుంకాలు చివరకు సగటు అమెరికన్ వినియోగదారుడినే ముప్పు తిప్పలు పెట్టే పరిస్థితీ రావొచ్చు!
అమెరికా చాలా వస్తువుల విషయంలో దిగుమతుల మీదే ఆధారపడి ఉంది. ఆఖరికి టిష్యూ పేపర్లను కూడా దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉంది. ఇలా మొదలుపెడితే ఇది ఎంత వరకూ వెళ్తుందంటే.. ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే నినాదాలతో ట్రంప్ వర్గం పంచిన టోపీలు కూడా చైనాలోనే తయారయి అమెరికాకు వెళ్లినవేనట! వాటి డిజైన్ ను అమెరికాలో చేసినా, ఆ డిజైన్ టోపీ రూపం సంతరించుకున్నది మాత్రం చైనాలోనే! అలాగే చైనా వస్తువులను బహిష్కరించాలంటూ కొందరు అమెరికన్ జాతీయవాదులు ధరించే టీ షర్టులు కూడా చైనాలోనే తయారవైననేట! ఆఖరికి చైనాను ధ్వేషించాలన్నా..ఆ ప్రచారాలకు మళ్లీ చైనా మీదే ఆధారపడాల్సిన పరిస్థితుల్లో అమెరికా ఉంది!
మరి అమెరికాలో అధ్యక్షుడి పదవీ కాలం నాలుగు సంవత్సరాలే. ఇప్పటికే ట్రంప్ ఒక పర్యాయం పదవిని పూర్తి చేసుకుని ఉన్నాడు. నాలుగేళ్లు ఇట్టే గడిచిపోతాయి కూడా! కాబట్టి.. ట్రంప్ నిర్ణయాలు దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం చూపినా.. దాన్ని క్లైమ్ చేసుకోవడానికి అయినా, బాధ్యత వహించుకోవడానికి అయినా ట్రంప్ పదవిలో ఉండకపోవచ్చు! అయితే ఈ నిర్ణయాలు ట్రంప్ వి అయినా, ఆయన ఒక పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కాబట్టి.. వాటికి ఆ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే ట్రంప్ చెబుతున్న అమెరికా ఫస్ట్ నినాదానికి కూడా ఆ పార్టీ తరఫున ప్రతినిధులు ఉండనే ఉంటారు. వారు ట్రంప్ ఆలోచనలను తలదన్నే వాళ్లూ కావొచ్చు. ఇప్పుడు ట్రంప్ ప్రకటిస్తున్న నిర్ణయాలకు మించిన నిర్ణయాలను వారు అమల్లో పెట్టనూ వచ్చు! ట్రంప్ మొదలు పెట్టిన దాన్ని మరొకరు ఎలా, ఏ స్థాయికి తీసుకెళ్తారనేది శేష ప్రశ్న!
అంతకన్నా ముందు జవాబు దొరకాల్సిన అంశం.. టారీఫ్ ల వల్ల పెరిగే విపరీతమైన వస్తు ధరలను సగటు అమెరికన్ ఎలా తీసుకుంటాడనేది! టారీఫ్ ల వల్ల దిగుమతి చేసుకునే కంపెనీలు అమెరికన్ ప్రభుత్వానికి భారీ సుంకం చెల్లిస్తాయి. ఆ సుంకాలు మళ్లీ అవి వినియోగదారుల నుంచినే వసూలు చేసుకోవాలి! మరి నినాదాలు ఇవ్వడం వరకూ జనాలకు నష్టం లేదు. అయితే ఆచరణలకు వచ్చే సరికి డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు మళ్లీ ఆలోచనలు మారిపోతాయి! చైనా వస్తువుల దిగుమతిని తగ్గించాలనే నినాదం ఇస్తే సరిపోదు, ఇప్పుడు ప్రభుత్వం దిగుమతులపై భారీ సుంకాలు విధించడం ..ఆ డబ్బులు తామే చెల్లించాల్సిన పరిస్థితుల్లో సగటు అమెరికన్ తన ఆ దేశభక్తిని ఎలా నిరూపించుకుంటాడో చూడాల్సి ఉంది. దిగుమతి అయ్యే ప్రతిదాని ధరా పెరిగితే.. దాన్ని ప్రభావం అమెరికన్ రోజువారీ జీవితం మీద పడుతుంది. అందునా.. టిష్యూ పేపర్ దగ్గర నుంచి లగ్జరీ ఐటమ్స్ వరకూ ప్రతిదాన్నీ దిగుమతి చేసుకుని వాడుకునే పరిస్థితుల్లోనే ఉన్న దేశంలో ఈ అర్ధాంతర నిర్ణయాల అంతిమ ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశం!
దిగుమతుల పై సుంకాలు వేసేస్తే.. కంపెనీలన్నీ రాత్రికి రాత్రి దేశంలోనే ప్రొడక్షన్ మొదలుపెట్టేసి.. దేశంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టేయడంతో పాటు, విపరీతంగా అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చేసి.. దేశాన్ని అభివృద్ధి చేసేస్తాయనేది ఈ సుంకాల థియరీని యమ అర్జెంటుగా అమలు చేయడంతో.. ట్రంప్ చెబుతున్నట్టుగా అమెరికా తిరిగి గ్రేట్ అవుతుందో! లేక వినియోగదారుడు ఇక్కట్ల పాలయ్యే పరిస్థితి వచ్చి, కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా అవుతుందో!