ఒకవైపు పార్టీలోని సీనియర్లు.. పార్టీని కాపాడుకోవాలంటూ వాపోతున్నారు. పార్టీని కాపాడండి అంటూ ఆ పార్టీని నాశనం చేస్తున్న వారితోనే మొరపెట్టుకుంటున్నట్టుగా ఉంది వారి పరిస్థితి! అలాంటి వారు ఒక సమూహంగా ఏర్పడి తమకో పేరు కూడా పెట్టుకున్నారు. బీజేపీని ఎదుర్కొనేలా కాంగ్రెస్ ను సన్నద్ధం చేయాలనే వారు అంటున్నారు. తమకు నాయకత్వం అప్పగించాలనో, ఫలానా వారిని నాయకుడిగా నియమించాలనో వారు డిమాండ్ చేయడం లేదు. జస్ట్ పార్టీ పరిస్థితి మెరుగవ్వాలని, నాయకత్వం ఆ దిశగా పని చేయాలని అంటున్నారు. అలాంటి వారిపై సోనియా, రాహుల్ లకు తగని కోపం లేకపోలేదు.
ఇక ఈ పరిస్థితుల్లో.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరగడంతో, ఏదో మార్పులకు శ్రీకారం చుట్టారేమో అని కాంగ్రెస్ వీరాభిమానులు ఆశించి ఉండవచ్చు. అయితే.. మరీ అన్ని ఆశలు పెట్టుకోవద్దని ఆ మీటింగ్ గురించి వివరాలను చెప్పిన అంబికా సోనీ మాటలను బట్టి స్పష్టం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీకి జాతీయాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను సెప్టెంబర్ కల్లా పూర్తి చేస్తారట. ఆల్రెడీ అక్టోబర్ వచ్చేసింది కదా, సెప్టెంబర్ ఏమిటి అంటే.. వచ్చే ఏడాది సెప్టెంబర్ కు అట! 2022 సెప్టెంబర్ నాటికి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పూర్తి చేస్తారట! అబ్బో.. చాలా తక్కువ టార్గెట్ నే పెట్టుకున్నారే అని ఎవరూ విస్తుపోనక్కర్లేదు. మరో ఏడాది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండబోతోందని కాంగ్రెస్ ఇన్ డైరెక్టుగా చెబుతోందనమాట.
ఇక ఏడాది పాటు చిలికి చిలికి అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయబోతున్నామని ఒక వైపు చెబుతున్నారు. మరోవైపేమో ఆ అధ్యక్ష బాధ్యతలను రాహులే తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారంతా ఏకగ్రీవంగా చెప్పారట. వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ సీఎంలంతా రాహుల్ కు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించమని విన్నవించారట!
రాహుల్ మాత్రం చిద్విలాసంగా.. వారి విన్నపాన్ని 'కన్సిడర్' చేస్తానంటూ చెప్పారట! మరి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవిని తీసుకోవాలా.. వద్దా అని రాహుల్ తేల్చుకోవడానికి ఏడాది సమయం పడుతుంది కాబోలు. వచ్చే ఏడాది సెప్టెంబర్ కు ఈ వ్యవహారంపై రాహుల్ ఒక అభిప్రాయానికి వస్తారట! అంత వరకూ ఇంతే సంగతులు అని సీడబ్లూసీ మీటింగ్ లో తేల్చినట్టుగా ఉన్నారు!