ఐపీఎల్ 2022 సీజన్ కు పెద్ద సమయం ఏమీ ఉండదు. అయితే వచ్చే సీజన్ విషయంలో పలు ఆసక్తిదాయకమైన మార్పులు కూడా జరగబోతున్నాయి. వచ్చే సీజన్ ఐపీఎల్ కు జట్ల సంఖ్యను పెంచాలనేది బీసీసీఐ తపన. ఇది వరకూ ఒకసారి ఎనిమిదికి మించి జట్ల సంఖ్యను పెంచారు.
అయితే ఆ సీజన్లో ఐపీఎల్ కు అదనపు ఆకర్షణలేవీ దక్కలేదు. జట్ల సంఖ్య ఎక్కువైనా.. ఆ తర్వాతి రాజకీయాల్లో.. కొత్త జట్లు గల్లంతయ్యాయి. చివరకు మళ్లీ ఎనిమిది జట్లే మిగిలాయి. ఇప్పుడు మళ్లీ జట్ల సంఖ్యను పెంచాలని, తద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని బీసీసీఐ తెగ ప్రయత్నిస్తోంది.
ఇప్పటి వరకూ ఐపీఎల్ ఫార్మాట్ బాగానే ఉంది. ఒక్కో జట్టు మరో జట్టుతో కనీసం రెండు మ్యాచ్ లు ఆడుతుంది. ఒకటి హోం గ్రౌండ్ లో, రెండోది ప్రత్యర్థి గ్రౌండ్ లో. ఈ ఫార్మాటే ఐపీఎల్ కు అదనపు ఆకర్షణగా ఉంది. జట్ల సంఖ్యను పెంచితే ఈ ఫార్మాట్ లో మ్యాచ్ లను నిర్వహించడం సాధ్యం కాదు. కనీస రెండు జట్లను అదనంగా చేర్చినా.. ఒక్కో జట్టు 18 మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది సీజన్ కు.
ప్రస్తుతం ఈ సంఖ్య 14 గా ఉంది. ఒక్కో జట్టు 18 మ్యాచ్ లు ఆడాలంటే ఐపీఎల్ షెడ్యూల్ ను కనీసం వారం పది రోజుల పాటు పెంచాల్సి వస్తుంది. నెలన్నర పాటు జరిగే షెడ్యూల్ ను రెండు నెలల పాటు లాగితే.. ప్రేక్షకులకే ఆసక్తి సన్నగిల్లవచ్చు. అయితే.. బీసీసీఐ మాత్రం రెండు జట్లను కొత్తగా తెస్తే డబ్బులు వస్తుందని భావిస్తున్నట్టుగా ఉంది. డబ్బులు వస్తే చాలా.. లీగ్ పై ప్రేక్షకుల్లో అనాసక్తి కలిగితే ఎలా? అనే అంశాన్ని ప్రస్తుతానికి పట్టించుకుంటున్నట్టుగా లేరు!
వాస్తవానికి ఐపీఎల్ ఆరంభంలో ప్రతి మూడేళ్లకూ రెండు జట్లను అదనంగా పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. మొదట ఎనిమిది నగరాల పేరుతో ప్రాంచైజ్ లను ప్రకటించినట్టుగా, ప్రతి మూడేళ్లకూ రెండు కొత్త నగరాలకూ ప్రాంచైజ్ ఇస్తామని ప్రకటించారు. అయితే అదంతా ఆచరణ సాధ్యం కాదని.. లలిత్ మోడీ సమయంలోనే తేలిపోయింది.
ఇప్పుడు గంగూలీ అదనపు జట్లు, అదనపు సంపాదన మీద దృష్టి పెట్టినట్టుగా ఉన్నాడు. మొదటేమో సాధ్యం కాదని కామ్ అయ్యారు, ఆ తర్వాత జట్ల సంఖ్యను పెంచి భంగపడ్డారు. ఇప్పుడు మళ్లీ విఫల ప్రయోగాన్ని రిపీట్ చేస్తామని అంటున్నారు. మరి ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయో. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ ను స్వదేశంలో నిర్వహిస్తామనే ఆశాభావాన్ని కూడా గంగూలీ వ్యక్త పరిచాడు.