బాబుని ధిక్కరిస్తున్న తమ్ముళ్ళు… ?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబే అధినాయకుడు. ఆయన మాటే శిలాశాసనం. అలాంటి బాబు ఒక నిర్ణయం తీసుకుంటే దానిని ఎవరైనా గౌరవించి తీరాల్సిందే. కానీ చిత్రంగా కొందరు తమ్ముళ్ళు మాత్రం మీ నిర్ణయం తప్పు, మార్చుకోండి…

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబే అధినాయకుడు. ఆయన మాటే శిలాశాసనం. అలాంటి బాబు ఒక నిర్ణయం తీసుకుంటే దానిని ఎవరైనా గౌరవించి తీరాల్సిందే. కానీ చిత్రంగా కొందరు తమ్ముళ్ళు మాత్రం మీ నిర్ణయం తప్పు, మార్చుకోండి అంటున్నారు. ఒక విధంగా ఇది పార్టీ లైన్ దాటడమే.

కానీ తమ్ముళ్ళు మాత్రం మాదే రైట్ అంటున్నారు. ఇంతకీ ఆ కధా కమామీషూ ఏంటి అంటే విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో తాజాగా టీడీపీ ఇంచార్జిని చంద్రబాబు మార్చేశారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్లేస్ లో పీవీజీ కుమార్ అనే కొత్తాయనకు అవకాశం ఇచ్చారు.

ఈ పరిణామాలతో బాధపడుతున్న రామానాయుడు వర్గం తాజాగా సమావేశమై ఇంచార్జి పదవిని తిరిగి రామానాయుడుకే ఇవ్వాలంటూ తీర్మానం చేసింది. ఈ మీటింగునకు మాడుగులలోని నాలుగు మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు హాజరు కావడం విశేషం. 

ఇదిలా ఉంటే 2019 ఎన్నికల ముందు వచ్చిన పీవీజీ కుమార్ ఎక్కువా పార్టీ కోసం పదేళ్ళ పై నుంచి పనిచేస్తున్న రామానాయుడు ఎక్కువా అంటున్నారు తమ్ముళ్ళు. పైగా మాడుగులలో రామానాయుడుకే జనం మద్దతు ఉంది అంటున్నారు. మొత్తానికి తమ్ముళ్ళు తీర్మానం చేశారు. 

బాబూ మీ నిర్ణయం మాచుకోండి అంటున్నారు. మరి చంద్రబాబు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారా. లేక తమ్ముళ్ళ మీద యాక్షన్ ఉంటుందా.. చూడాల్సిందే.