ప్రధాని నరేంద్రమోదీ వాడిన వస్తువులంటే అందరికీ చాలా క్రేజ్. ఆమధ్య ఆయన తొడిగిన 'కోటు'ని 4కోట్ల 31 లక్షలకు ఓ వ్యక్తి కొన్నాడు. అప్పటినుంచి మోదీ వస్తువులకి ఎక్కడలేని డిమాండ్.
గతంలో ఆయనకు వచ్చిన బహుమతుల్ని వేలం వేస్తే ఈ-ఆక్షన్ లో ఎవరికీ దొరికేవి కావు. కానీ తొలిసారి ఆయన వస్తువుల్లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 162 వస్తువులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. అందులో మోదీ తల్లితో కలసి దిగిన ఫొటో కూడా ఉంది.
మోదీ భక్తులూ.. ఇది వింటున్నారా..?
మా గుండెల్ని చీల్చి చూస్తే మోదీ ఉంటారు, మా ఇంట్లో దేవుడి గదిలో మోదీ పటం ఉంటుంది, నిద్రలేచి మేము చూసే మొదటి మొహం మోదీదే.. ఇలా 'నమో' భక్తులు బాగానే హడావిడి చేస్తుంటారు. సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. అలాంటి వారంతా మోదీ క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతుందనే చెబుతారు. మరి మోదీ వస్తువులకి డిమాండ్ తగ్గడంపై వారు ఏమని వివరణ ఇస్తారో చూడాలి.
నమామి గంగే ప్రాజెక్ట్ కి నిధులు సమకూర్చడంలో భాగంగా ప్రస్తుతం మోదీ వస్తువుల్ని వేలం వేశారు. దీనిలో 162 వస్తువుల్ని ఎవరూ పట్టించుకోలేదు. బాక్సింగ్ క్రీడాకారులు మోదీకి ఇచ్చిన గ్లౌస్ లు, హాకీ క్రీడాకారులు సంతకం పెట్టి ఇచ్చిన హాకీ స్టిక్, వివిధ దేశాలవారు మోదీ మెడలో వేసిన శాలువాలు.. జనం పక్కనపెట్టేసిన లిస్ట్ లో ఉన్నాయి. గతంలో మోదీ పట్టుకున్న వస్తువు అంటే భలే క్రేజ్, ఇప్పుడు ఆ క్రేజ్ జనాల్లో బాగా తగ్గిపోయిందనడానికి ఇదే నిదర్శనం.
మోదీ క్రేజ్ కాకుండా.. ఆయా క్రీడాకారుల క్రేజ్ వల్లే కొన్ని వస్తువులకు భారీగా రేట్లు పలికాయి. ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా విసిరిన బల్లెం రూ. కోటీ 50వేలు పలికింది. పీవీ సింధు ఆడిన రాకెట్ ఖరీదు రూ.80లక్షలు.. ఇలా మోదీ ప్రభ కంటే.. ఆయా క్రీడాకారులపై ఉన్న క్రేజ్ తోటే వాటికి ఎక్కువ రేట్లు పలికాయి. మోదీ వాడిన కండువాలు, దుప్పట్లు, బూట్లు.. ఇలాంటివన్నీ మిగిలిపోయిన సరుకులో ఉన్నాయి.