పింఛన్లు ఇచ్చారు సరే.. పండగ పూట జీతాలెక్కడ..?

ఏప్రిల్ 1 ఏపీలోని అవ్వా తాతలందరికీ పింఛన్లు పంపిణీ చేశాం, వాలంటీర్లంతా ఇంటికెళ్లి మరీ పండగకి ముందే పింఛన్లిచ్చారంటూ వైసీపీ నేతలు హడావిడి చేశారు. సాక్షిలో కూడా అదే బ్యానర్ ఐటమ్. ఇక్కడి వరకు…

ఏప్రిల్ 1 ఏపీలోని అవ్వా తాతలందరికీ పింఛన్లు పంపిణీ చేశాం, వాలంటీర్లంతా ఇంటికెళ్లి మరీ పండగకి ముందే పింఛన్లిచ్చారంటూ వైసీపీ నేతలు హడావిడి చేశారు. సాక్షిలో కూడా అదే బ్యానర్ ఐటమ్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల సంగతేంటి..? ఉద్యోగులు కూడా ఒకటో తేదీ జీతాల కోసం ఎదురు చూస్తారు కదా..? ఒకటి లేదు, కనీసం రెండో తేదీ అయినా జీతాలు పడతాయనే ఆశ లేదు. ఆదివారం కూడా సెలవు. ఇక సోమవారం కోసం వేతన జీవులు వేచి చూడాల్సిందే. అంటే.. 4వ తేదీ వరకు వెయిటింగ్.

తప్పెవరిది..?

ప్రతి దానికీ ఖజానాలో నిధులు లేవు అంటే కుదరదు. కనీసం ఇలాంటి పండగ రోజులు, సెలవలు వస్తున్నాయని అనుకుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో సెలవలు వస్తే 31వతేదీనే జీతాలు పడతాయి. మరీ అంత చేయకపోయినా.. కనీసం ఒకటో తేదీ అయినా జీతాలు వేసి ఉంటే బాగుండేది. 

ఉన్నతాధికారుల్లో ఆ ప్లానింగ్ లేకపోవడం వల్లే ఈ తిప్పలన్నీ. అదే సమయంలో సామాజిక పింఛన్ల విషయంలో జగన్ ఊరుకోరు కాబట్టి… అవ్వాతాతలకు మాత్రం ఠంచనుగా పింఛన్లు వచ్చేశాయి. ఉద్యోగుల విషయంలో జగన్ ఆరా తీసే పరిస్థితి లేదు కాబట్టి.. ఉన్నతాధికారులు లైట్ తీసుకున్నారు, ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు పడేందుకు పరోక్షంగా కారణమయ్యారు.

సంక్షేమంలో ఉద్యోగులు కూడా భాగమే కదా..?

సంక్షేమ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. అందులో రెండోమాటే లేదు. అయితే ఉద్యోగుల జీతాల పెంపు విషయానికొచ్చేసరికి ఇటీవల కాస్త గడబిడ జరిగింది. సీపీఎస్ రద్దు హామీ కూడా అలాగే ఉంది. ఈ దశలో కనీసం ఒకటో తేదీ అయినా జీతాలు పడితే ఉద్యోగులు ప్రత్యేకంగా సంతోషపడరు కానీ, అసంతృప్తి ఉండదు. 

పండగ వేళ నాలుగు రోజులు ఆలస్యంగా జీతాలు పడితే అసంతృప్తి స్థాయి పెరుగుతుంది. కనీసం దాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా ఉగాదికి కాస్త ముందుచూపుతో వ్యవహరించి ఉంటే బాగుండేది.