తాజ్ మహల్ నిర్మాణానికి.. రాళ్లెత్తిన కూలీలెవ్వరు!
‘దేశచరిత్రలు’ అంటూ మహాకవి శ్రీశ్రీ గర్జించిన వాక్యాలు ఇవి. వర్తమాన సమాజపు ‘దేశచరిత్రలు తెలుసుకోవాలంటే ఇవే వాక్యాలను కాస్త మార్చి రాసుకోవాలి..
తాజ్ మహల్ నిర్మాణానికి.. గట్టిదైన పునాది ఎట్టిది?
అని చదువుకోవాలి. అవును మరి.. కంటికి కనిపించడంలేదు గనుక.. పునాది గురించి పట్టించుకోకపోతే ఎట్లా? కంటికి కనిపిస్తున్నవి మాత్రమే అభివృద్ధి అనుకుంటే ఎట్లా? కానీ ఆధునిక తెలుగురాష్ట్రాల గమనంలో అభివృద్ధికి నిర్వచనం అంటే కేవలం కంటికి కనిపించేది మాత్రమే. అదే బాటలోనే సాగుతున్నాయి. అందుకే నాశనం దిశగా అడుగులు పడుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల విభిన్నమైన రీతుల్లో ఇలాంటి అవ్యవస్థ నడుస్తోంది. ‘కనిపించే- కనిపించని..’ వ్యవహారాల మధ్య డ్రామా వర్తమాన సమాజాన్ని పక్కదారి పట్టిస్తోంది. మాయ చేస్తోంది. ఈ వైరుధ్యాల గురించిన విశ్లేషణే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘కనిపించేదే నిజమా?’
‘అటుచూస్తే- నెలపెడితే చాలు లక్షలకొద్దీ జీతం సంపాదించే గుణవంతుడైన అబ్బాయి. ఇటు చూస్తే- ఏకంగా కోట్లకు కోట్ల రూపాయల ఆస్తులు కట్నకానుకలుగా తెచ్చుకున్న అమ్మాయి! అట్టహాసంగా వివాహం! కళ్లు చెదిరే సౌందర్యాలంకరణలతో కల్యాణ మండపం, ఒక్కోప్లేటు రెండు వేల రూపాయలకు తగ్గని భోజనాలు, వేలమంది అతిథులు, అందరికీ లక్షల రూపాయల విలువైన రిటర్న్ గిఫ్టులు ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలనంత గొప్ప పెళ్లి.
అంతకంటె అద్భుతమైన పెళ్లి ఉండకపోవచ్చు. కానీ, అది అత్యద్భుతమైన దాంపత్యం అని అనగలమా? ఆ రెండు హృదయాల నడుమ, మనసులోపలి పొరల్లో ప్రేమను విత్తలేకపోయినప్పుడు.. అది ఎలాంటి దాంపత్యం అవుతుంది? ఆ ప్రేమ ఎక్కడ ఉంటుందంటే.. దాన్ని మనం ఎలా చూపించగలం! ఎలా సాధ్యం?’ తెలుగురాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంది. ఒకచోటనేమో.. కనిపించే పనులు చేస్తే చాలు.. మనం అద్భుతంగా పరిపాలిస్తున్నట్టు అందరూ అనుకుంటారు. గంపగుత్తగా ఓట్లు వచ్చి మన బుట్టలో పడిపోతాయి. ఇక మనకు తిరుగుండదు.. అనే నమ్మకం! మరోచోట- కనిపించని అభివృద్ధి.. జీవితాలను స్థిరపరిచే అభివృద్ధి జరుగుతోంటే.. పైపై మెరుగులకోసం విమర్శలు! ఇదే జరుగుతోంది.
ఏది మంచి ఏది చెడు అనే విషయాల్లో ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. ఏది అవసరం? ఏది అనవసరం? అనే విషయంలో ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయి. కానీ మూలాల్లోకి వెళ్లకుండా అభివృద్ధి పనులు చేయడం అనేది.. రోగహేతువును డయాగ్నయిజ్ చేయకుండా చికిత్స చేయడం లాంటిది! అలాంటి అభివృద్ధి దుష్ఫలితాలే ఇవాళ మన కళ్లెదురుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ- నరకప్రాయమైన రాజధాని!
‘మన రాష్ట్రం మన అభివృద్ధి’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. విజయం సాధించారు. పోరాటం బహుముఖాలుగా జరిగింది. అందరి పోరాటస్ఫూర్తి త్యాగాలు లేకుండా రాష్ట్రం వచ్చేదే కాదు.. కానీ, పోరాటాన్ని పాపులరైజ్ చేసిన ఘనత కేసీఆర్ ది గనుక.. ఆయన సునాయాసంగా గద్దె ఎక్కారు. పదేళ్లుగా పాలన సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయని అంతకుపూర్వం ప్రచారం చేశారో.. అందులో కొంతవరకు సాధించారు. చాలా విషయాల్లో వెనకబడి ఉన్నారు. ప్రస్తుతానికి ఒక్క విషయం ప్రధానంగా చెప్పుకోవాలి. హైదరాబాదు నగరంలో కొన్నిరోజులుగా వర్షాలు పడుతున్నాయి. జనజీవితం మొత్తం అతలాకుతలం అవుతోంది. జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులు కూడా నీటిమడుగులుగా మారిపోతున్నాయి.
దాదాపు నెలరోజులకు పైగా ఉత్తరాది, ఢిల్లీల్లో వరద ఉధృతి జీవితాలను ఎలా ప్రమాదంలోకి నెడుతున్నదో చూస్తూనే ఉన్నాం. హైదరాబాదుకు వరద రావాల్సిన అవసరం లేదు. వర్షం వస్తే చాలు. అదే స్థాయి విలయం ఇక్కడ అడుగడుగునా సాక్షాత్కరిస్తుంది. హైదరాబాదు నగరంలో వర్షం కష్టాల గురించి ప్రత్యేకంగా ఒక్క వాక్యం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అవి అందరికీ తెలిసిన కష్టాలే.
అయితే ఇక్కడ ప్రస్తావించదలచుకున్నది ఏంటంటే.. నాలుగువందల ఏళ్ల నగరం ‘వర్ష నరకం’ గా విలసిల్లడంలో.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏం మార్పు వచ్చింది. ఈ నగరం దుస్థితిని ఈ పాలకులు ఏం మార్చగలిగారు?
అలాగని కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాదు నగర అభివృద్ధి పరంగా నిష్క్రియాపరంగా ఉన్నదని అనడానికి వీల్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా వలస పాలకులు ఉన్నప్పుడు కూడా.. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన అభివృద్ధిని హైదరాబాదులోనే కేంద్రీకృతం చేశారు. ఇప్పుడు తెలంగాణ పాలకులు వచ్చిన తర్వాత కూడా చేస్తున్న పని అదే! కొన్ని కోణాల్లో హైదరాబాదు రూపురేఖలు బహుధా మారుతున్నాయి. ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. కొత్త ఫ్లై ఓవర్లు, కొత్తకొత్త అండర్ పాస్ లు నిర్మాణం అవుతూనే ఉన్నాయి.
నగరంలో ఒక ప్రాంతానికి ఓ ఏడాది తర్వాత హఠాత్తుగా వెళితే.. అక్కడ ఒక ఫ్లైఓవర్ గానీ మరొకటి గానీ ఏర్పడి ఉంటుంది. అంత ముమ్మరంగా నగరం నలుమూలలా ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం గర్వపడేలాగా అద్భుతమైన సచివాలయాన్ని కేసీఆర్ సర్కారు నిర్మించింది. భారత రాజ్యాంగసభకు నేతృత్వం వహించిన అంబేద్కర్ విగ్రహాన్ని.. దేశంలోనే అతిపెద్దదిగా హైదరాబాదులో నెలకొల్పడం అనేది ఒక చారిత్రక ఘట్టం. అమరవీరుల జ్యోతి కూడా ఒక అద్భుతం. కేసీఆర్ చెప్పినట్టు.. హైదరాబాదుకు ఏ అతిథి వచ్చినా సరే, ముందు అక్కడకు తీసుకువెళ్లి తర్వాత తతిమ్మా కార్యక్రమాలకు వెళ్లేంత అపురూపమైన నిర్మాణం.
ఇవన్నీ ‘కంటికి కనిపించే’ అందాలు, అద్భుతాలు! కంటికి కనిపించే వాటిమీద కేసీఆర్ సర్కారు విపరీతమైన శ్రద్ధ పెడుతోంది. ప్రజలు వీటిని చూసి.. తమ పాలకుడు చేస్తున్న అద్భుతాల పట్ల దిగ్భ్రమకు గురై ఎప్పటికీ భారాసను నెత్తిన పెట్టుకుంటూ ఉంటారనేది వారి ఆలోచన. నిజమే కావొచ్చు. ఈ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతోంటే.. అందులో దొర్లే చిన్న చిన్న పొరబాట్లు, అవినీతి ప్రజలకు పెద్దగా పట్టవు. మరి కంటికి కనిపించే పనుల మీద ఇంత శ్రద్ధ పెడుతున్న సర్కారు కంటికి కనిపించని వాటిని ఎందుకు విస్మరిస్తోంది.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను వారు ఎందుకు చక్కదిద్దలేకపోతున్నారు. ఆ వ్యవస్థ భూమి కింద ఉంటుంది.. ఎన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టి పనులు చేసినా సరే.. కంటికి కనిపించేది కాదు. దానిమీద ఖర్చు పెట్టడం ఎందుకు అని సర్కారు చిన్నచూపు చూస్తోందా? అనే అనుమానం కలుగుతోంది.
ప్రగతి అనే దానిని ప్రదర్శనామాత్రంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వాలకు చాలా వరకు ఉంటుంది. బయోడైవర్సిటీ సదస్సు జరిగినప్పుడు.. దేశదేశాలకు చెందిన అరుదైన ప్రతినిధులు హైదరాబాదుకు వస్తే అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు సదస్సు జరిగే ప్రాంతం చుట్టూతా రోడ్లకు ఎలాంటి సొబగులు హడావుడిగా అద్దిందో మనం చూశాం. ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాదు నగరానికి వస్తే.. కేసీఆర్ సర్కారు.. ఆమె తిరిగే ప్రాంతాల్లో మనుషులకు కొత్త బట్టలు తొడగడం ఒక్కటే తక్కువ అన్నట్టుగా.. రోడ్లను తీర్చిదిద్దింది. రంగులు వేయించింది. చాలా అతిశయమైన హంగులు చేపట్టింది.
మనవాళ్లకు ప్రదర్శించుకోవడం మీదనే మక్కువ. లోలోపల వ్యవస్థ మొత్తం పుచ్చిపోయి ఉన్నా సరే.. పైపైన మెరుగులు దిద్దేసి మాయచేయాలని చూస్తే ఎలాగ? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయడం అనేది తమ బాధ్యత అని ఈ ప్రభుత్వం భావించడం లేదా? లేదా, ఏదో ఏడాదిలో కొన్ని వారాల పాటు మాత్రమే కదా ప్రజలకు నరకం చూపిస్తున్నాం.. ఆమాత్రం నరకం చూపిస్తే తప్ప వారికి తతిమ్మా మనం సృష్టించిన ‘కనిపించే’ స్వర్గం విలువ తెలియదు కదా.. అనే ఆలోచనలతో వారు వర్తిల్లుతున్నారా? అనేది తలచుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది.
కేసీఆర్ సర్కారుకు ‘కనిపించే’ ప్రగతి మీద మాత్రమే దృష్టి ఉంది. కనిపించని అభివృద్ధి చేసినా కూడా దండగ అనే భావనను వారు వదలుకోవాలి.
ఆంధ్రప్రదేశ్- ఇక్కడంతా ఇంకో తరహా!
‘కనిపించే’ అభివృద్ధి అంటే భారీ భవంతులు, ఆకాశహర్మాలు, అతిపెద్ద సెక్రటేరియేట్ లాంటివి అని పైన చెప్పుకున్నాం కదా. ఏపీలో అలాంటివి మనకు మచ్చుకైనా కనిపించవు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలు అసలు లేవు. ఎన్నడో ప్రారంభమైన కొన్ని ఫ్లై ఓవర్లు పూర్తయ్యాయి. ఇంకా పూర్తయ్యే దశలో కొన్ని ఉన్నాయి. మహా అయితే విశాఖలో టూరిజం కోసం నిర్మిస్తున్న భవనంగా చెబుతున్నది మాత్రం ఇంకా నడుస్తోంది. అంతకు మించి ఏమీ లేవు. మరి ఈ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో అంత అచేతనంగా ఉన్నదా? పనిచేయకుండా ఉన్నదా? ఈ ఎందుకూ కొరగాని ప్రభుత్వమా? అనే సందేహాలు పుట్టడం సహజం కదా?
కానీ ఇక్కడి పరిస్థితి వేరు. గ్రామస్థాయిలో ప్రభుత్వ వ్యవస్థలకు కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. వ్యవసాయ కమిటీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ స్కూళ్లను కనీవినీ ఎరుగనిస్థాయిలో ప్రెవేటు స్కూళ్లను తలదన్నేలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతోంది. గ్రామీణ పరిపాలన వ్యవస్థలో ఎంతో కీలకమైన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండవలసిన సచివాలయ భవనాలు లాంటివి నిర్మాణం అవుతున్నాయి. అయితే తమాషా ఏంటంటే.. ఇవేవీకూడా మనం చెప్పుకుంటున్న ‘కనిపించే’ అభివృద్ధి కిందకు రావు.
జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి జరగడం ఒక్కటే ముఖ్యం. దాన్ని అందరికీ ప్రదర్శించుకోవాలనే అభిలాష లేదు. అందుకే ఆయన ఇలాంటి నిర్మాణాల మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీటన్నింటినీ విస్మరించి విపక్షాలు మాత్రం.. రోడ్లు బాగు చేయడం లేదు అనే ఒకే మాట అంటుంటాయి. రోడ్లు వర్షాలకు ఖచ్చితంగా చెడిపోతుంటాయి. వర్షాలు పడుతుండగా బాగు చేయడం కూడా కష్టం. పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే బాగు చేయగలరు. అలాంటి పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ, రోడ్డు మీద ఒక గొయ్యి ఏర్పడగానే దానిని ఫోటోతీసి సోషల్ మీడియాలో షేర్ చేసేసి, సెల్ఫీలు దిగి ప్రభుత్వం నిందలు వేయాలనుకునే వారికి ఇవేం పట్టవు. అలాగని జగన్ సర్కారు నూరుశాతం లోపరహితం అనడానికి వీల్లేదు.
వర్షాల కోణంలోంచి చూసినప్పుడు.. జగనన్న కాలనీలు నీట మునగడం ఒక్కటీ ప్రభుత్వ ముందు చూపు రాహిత్యానికి నిదర్శనం. ఆయా స్థలాలను ఎంపిక చేసినప్పుడు.. వర్షాల నాటి స్థితిగతులను అంచనా వేయకపోవడం.. ముందుజాగ్రత్తగా ఎత్తుచేయడం వంటి చర్యలు తీసుకోకపోవడం మాత్రం ప్రభుత్వ లోపమే.
జగన్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం అమ్మఒడి అనే అద్భుతమైన ఆలోచన వల్ల.. ఇవాళ రాష్ట్రంలో చదువుకు దూరంగా ఒక్క పిల్లవాడు కూడా లేడనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాలి. డ్రాపువుట్స్ దాదాపుగా సున్నా అని అంగీకరించాలి. అలాగే పేదవర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పరంగా ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోంది. ఈ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలు నగదు పంపిణీ జరుగుతోంది. దీనిని విమర్శించే వాళ్లు ఉండొచ్చు గాక.. కానీ.. ఇలా నగదు పంచడం వెనుక అంతిమ పరమార్థం ఏమిటి? ఆయా పేదల జీవితాలు స్థిరీకరించడమే కదా!
పేదల జీవితాలు సమున్నతంగా స్థిరపడడమే ఈ పథకాల లక్ష్యం కదా! మరి వారి జీవితాలు స్థిరపడడం అనేది ఎలా కనిపిస్తుంది.? ఎక్కడ కనిపిస్తుంది? ‘కనిపించే’ పనుల మీద మాత్రమే ప్రభుత్వం దృష్టి పెడితే.. పేదల జీవితాలు ఎప్పటికి బాగుపడాలి? అలాగని ‘కనిపించే’ పనులను పట్టించుకోకపోతే.. జగన్ ప్రభుత్వపాలన గురించి నలుగురూ ఏం అనుకోవాలి? ఆ సంగతి పట్టించుకోకుండా.. ప్రజలే తన తొలిప్రాధాన్యం అని, వారి జీవితాలు బాగుపడడమే తనకు ముఖ్యమని, ‘కనిపించేవి’ ద్వితీయ ప్రాధాన్యం అని జగన్ తన చేతలతో నిరూపించుకుంటున్నారు.
నిజానికి కనిపించేవి, కనిపించనివి.. అభివృద్ధి పనుల్లో రెండూ అవసరమే. తెలంగాణ ఒక అంచున ఉంటే, ఏపీ రెండో అంచున ఉంది. కానీ రెండింటి మధ్య సమతుల్యతతో రాష్ట్రాలను పాలకులు ముందుకు తీసుకువెళ్లాలి. ఆ దృష్టి కేసీఆర్ కు ఉన్నప్పుడు.. ‘హైదరాబాదు అంటే వర్షాకాలం నరకం’ అనే నిర్వచనం నుంచి బయటకు వస్తుంది. అలాగే ‘జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో ఏంచేసింది?’ అనే తరహా కువిమర్శలకు కూడా కళ్లెం పడుతుంది.
..ఎల్ విజయలక్ష్మి