మ‌ట్కాలో మ‌ట్కా లేదు

ఎమోష‌న్ అంటే ఇత‌రుల క‌ష్ట‌సుఖాల‌కి స్పందించ‌డం. అది ద‌ర్శ‌కుడిలో లేక‌పోతే సినిమాలో మాత్రం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది.

మ‌ట్కా చూశాను. ఆ ప‌దంతో నాకున్న అనివార్య స్నేహం, ద్వేషంతో ఉద‌యాన్నే వెళ్లాను. అయితే ఆ సినిమాలో మ‌ట్కా లేదు. కేవ‌లం ద‌ర్శ‌కుడు క‌రుణకుమార్ అతి విశ్వాసం, నిర్ల‌క్ష్యం మాత్ర‌మే ఉన్నాయి.

అత‌ను ప‌లాస అని మంచి సినిమా తీశాడు. పేరు వ‌చ్చింది. శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ ఆడ‌లేదు. క‌ళాపురం చూసినోళ్లెవ‌రూ లేరు. త‌ర్వాత అవ‌కాశం వ‌రుణ్‌తేజ్ హీరో. ఖ‌ర్చుకి వెనుకాడ‌ని నిర్మాత‌లు.

మ‌ట్కా అని టైటిల్ ప్ర‌క‌టించిన‌ప్పుడు చాలా ఆస‌క్తి క‌లిగింది. పిరియాడిక్‌, వైజాగ్ బ్యాక్‌డ్రాప్, ర‌త‌న్‌ఖ‌త్రీ జీవిత‌మే ప్రేర‌ణ‌. ఒక గ్యాంగ్‌స్ట‌ర్ లైప్‌లోని వివిధ ద‌శ‌లు. ఒక సినిమా హిట్ కావ‌డానికి ఇంత‌కు మించి ఏం కావాలి? ట్రైల‌ర్‌, ప్ర‌మోష‌న్స్, డైలాగులు చూసిన‌ప్పుడు ఇది ఖ‌చ్చితంగా హిట్ అని చాలా మంది న‌మ్మారు. వ‌రుణ్ పాత్ర 20 ఏళ్ల గుర్తు వుంటుంద‌ని డైరెక్ట‌ర్ అన్నారు. ప్రేక్ష‌కుడికి 20 నిమిషాలు కూడా గుర్తుండ‌దు కానీ, వ‌రుణ్ తేజ్‌కి మాత్రం 20 ఏళ్లు గుర్తుంటుంది. ఇంత క‌ష్ట‌ప‌డిన సినిమాకి ఈ రేంజ్ అధ్వాన్న ఓపెనింగ్స్ రావ‌డం రికార్డే.

ఎక్క‌డుంది లోపం అంటే, క‌థ‌, క‌థ‌నంపైన పూర్తిగా అశ్ర‌ద్ధ‌. ఈ జ‌న‌రేష‌న్‌కి 100 మంది గ్యాంగ్‌స్ట‌ర్స్ తెలుసు. కానీ మ‌ట్కా జూదం తెలియ‌దు. కొత్త జూదాన్ని, కొత్త‌గా చెబితే స‌గం స‌క్సెస్ అక్క‌డే వ‌చ్చేది. కానీ అంద‌రికీ తెలిసిన ముత‌క గ్యాంగ్‌స్ట‌ర్ క‌థ ఎత్తుకున్నాడు. అద‌యినా కొత్త సీన్స్‌తో చెప్పాడా, లేదు. నాయ‌కుడు, వ‌న్స్ అపాన్ ఎ టైం ఇన్ ముంబ‌యి, ఇంకొన్ని ఇంగ్లీష్ సినిమాల నుంచి క‌త్తిరించి, అతుకులేసి క‌థ‌ని కుట్టాడు. న‌త్త‌ల్ని, తాబేళ్ళని, టీవీ సీరియ‌ళ్ల‌ని ప్రేర‌ణ‌గా తీసుకుని క‌థ‌నాన్ని వండాడు. మునిగిపోడానికి ఇంత‌కంటే ఏం కావాలి? ద‌ర్శ‌కుడు దారం ఎక్క‌డ నుంచి తెచ్చుకున్నా, సొంతంగా బ‌ట్ట‌ని నేయ‌గలిగి వుండాలి. ఈ పోటీలో నేత‌గాడే, చేత‌గాడు, లిప్ట్‌లు వ‌ర్క‌వుట్ కాదు.

మ‌ట్కా జూదంలోనే కావాల్సినంత డ్రామా వుంది. ర‌త‌న్ జీవితంలోనే వంద సినిమాల‌కి స‌రిప‌డా క‌థ వుంది. అత‌నే స్వ‌యంగా నిర్మాత కూడా. స‌రే, అదంతా వదిలేస్తే క్ష‌మార్హం కాని నేరం ఏమంటే మ‌ట్కా ఎలా ఆడ‌తారో, నిర్వ‌హిస్తారో కూడా ద‌ర్శ‌కుడికి తెలియ‌దు. అప్ప‌టి ప్ర‌ధాని ఇందిరాగాంధీ మ‌ట్కాపై ఆందోళ‌న‌తో, సీబీఐని రంగంలోకి దింపిన‌ట్టు సెకెండాఫ్‌లో ఒక ఎపిసోడ్ వుంది.

బాంబేలోని అండ‌ర్ వ‌రల్డ్ మొత్తం ఎమర్జెన్సీలో అరెస్ట‌యింది, లేదా ప‌రారైంది. ర‌త‌న్‌ఖ‌త్రీ అరెస్ట్ కూడా ఇందులో భాగ‌మే. ఇందిరాగాంధీకి మ‌ట్కా అనే పేరు తెలిసే అవ‌కాశం కూడా లేదు. మ‌ట్కా వ‌ల్ల దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కి వ‌చ్చిన న‌ష్టం కూడా ఏమీ లేదు. కొలంబియాలో జ‌రిగింది వేరు. డ్ర‌గ్స్ వ‌ల్ల అమెరికా ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తినింది నిజ‌మే కానీ, అక్క‌డ చేతులు మారింది డ్ర‌గ్స్, డ‌బ్బులు.

మ‌ట్కాలో చేతులు మారింది డ‌బ్బు మాత్ర‌మే. అది కూడా స్థానికంగా. ప్ర‌తి వూరిలోను లోక‌ల్ మ‌ట్కా కంపెనీలు ఉండేవి. దాని మీద పూర్తి పెత్త‌నం స్థానికుల‌దే. నెంబ‌ర్ మాత్రం బాంబే నుంచి వ‌చ్చింది.

రాయ‌ల‌సీమ ప్రాంతానికి బ‌ళ్లారి, తాడిప‌త్రి, ప్రొద్దుటూరు పెద్ద కంపెనీలు. సౌత్ ఇండియా హెడ్ క్వార్ట‌ర్ హుబ్లీ. ఒక నెంబ‌ర్ మీద ఎక్కువ మొత్తం బెట్టింగ్ జ‌రిగితే ఆ లోడ్ హుబ్లీకి బ‌దిలీ అయ్యేది. ఫోన్‌లో కేవ‌లం మాట మీద‌. ఆ న‌మ్మ‌కం, నెట్‌వ‌ర్క్ బ‌లంగా వుండేది. హుబ్లీ కూడా మోయ‌లేక‌పోతే అది బొంబాయికి, నేరుగా ర‌త‌న్‌కి.

నెంబ‌ర్ తీయ‌డంలో మోసం వుందో, లేదో ఎవ‌రికీ తెలియ‌దు. ఎందుకంటే అది జ‌నం మ‌ధ్య‌నే జ‌రిగేది. ఇంత ప‌క‌డ్బందీ జూదాన్ని హాస్యాస్ప‌దంగా సినిమాలో చూపించారు.

సినిమా అంటేనే రియాల్టీ కాదు, క‌ల్ప‌న‌. సినిమా లిబ‌ర్టీ అనేది వుంటుంది. అయితే నువ్వు తీసుకునే లిబ‌ర్టీ నీ తెలివిని చూపించాలి. అశ్ర‌ద్ధ‌ని, మూర్ఖ‌త్వాన్ని కాదు. ల‌క్కీ భాస్క‌ర్‌లో వున్న‌ది, మ‌ట్కాలో లేనిది అదే.

సినిమాలో విష‌యం వుంటే పూర్ణా మార్కెట్‌, టాకీస్ సెట్టింగ్‌లు లేక‌పోయినా చూస్తారు. సెట్టింగ్‌లు అనేవి కొత్త బ‌ట్ట‌ల‌కి కొట్టే సెంట్ లాంటివి. బ‌ట్ట‌ల్లేకుండా సెంటు కొట్టుకుంటే జ‌నం పారిపోతారు.

బ్ర‌హ్మాండ‌మైన సెట్టింగ్‌లు ఉన్న కురుక్షేత్రాన్ని (1977) జ‌నం చావ‌గొట్టారు. ద్రౌప‌దికి ఇచ్చే చీర‌ల్ని కూడా అతుకులేసి రంగురంగులుగా చూపించిన దాన‌వీర‌శూర‌క‌ర్ణ‌ని నెత్తిన పెట్టుకున్నారు. జ‌నం ఎన్టీఆర్‌ని చూశారు, సెట్టింగ్‌ల్ని కాదు.

చాలా మంది యువ ద‌ర్శ‌కుల స‌మ‌స్య ఏమంటే ప్రాజెక్ట్ సెట్ చేసి హీరోకి న‌చ్చితే చాలు. క‌థ‌, క‌థ‌నాన్ని గాలికి వ‌దిలేస్తారు. శ్ర‌ద్ధ పెట్ట‌రు. సినిమా, మాఫియా రెండూ ఒక‌టే. మాఫియా ఎలా ఎదుగుతారంటే ఎవ‌రికి చెందాల్సింది వాళ్ల‌కి చెందేలా చూసుకుంటారు. అంతా త‌నదే అనే వాడి కోసం బుల్లెట్ ఎదురు చూస్తూ వుంటుంది.

మ‌న ద‌ర్శ‌కుల‌కి ఈ చిన్న లాజిక్ కూడా తెలియ‌దు. క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం, వీలైతే సంగీతం, ఎడిటింగ్‌, ఫైటింగ్‌లు అన్నిటికి త‌మ పేరే వుండాలి. సినిమా క‌లెక్టీవ్ వ‌ర్క్‌. ఎవ‌రి క‌ష్టం వాళ్ల‌కి ద‌క్కాలి. నేనే స‌ర్వ‌స్వం అనుకునే ప్ర‌తివాడికీ చివ‌రికి ద‌క్కేది ఇబ్బందులే.

కొంద‌రు ఇంకొంచెం ముందుకెళ్లి మేనేజ‌ర్ల అవ‌తారం ఎత్తుతారు. కోడైరెక్ట‌ర్ల జీతం త‌గ్గించ‌డం, అసిస్టెంట్ల డైరెక్ట‌ర్ల సంఖ్య‌ని కుదించ‌డం, వీలైతే వాళ్ల‌కి ఒక‌ట్రెండు నెల‌ల జీతం నిర్మాత ఎగ్గొట్ట‌డానికి స‌హ‌క‌రించ‌డం, తెర‌మీద ఏం చూపించాలో వ‌దిలేసి, తెర‌వెనుక త‌మ విశ్వ రూపాన్ని చూపిస్తారు. ఆఫీస్‌బాయ్ రోజుకి ఎన్ని పాల ప్యాకెట్లు కొంటున్నాడో ఆరాలు తీసి, నిర్మాత‌కి ఖ‌ర్చు మిగిల్చిన బిల్డ‌ప్ ఇస్తాడు. నిర్మాత‌లు అమాయ‌కులు. నెల‌కి ఆఫీస్ ఖ‌ర్చు త‌గ్గింద‌ని సంతోషిస్తారు కానీ, కోట్ల రూపాయ‌ల‌కి బొక్క ప‌డింద‌ని క‌నుక్కోలేరు.

ఎమోష‌న్ అంటే ఇత‌రుల క‌ష్ట‌సుఖాల‌కి స్పందించ‌డం. అది ద‌ర్శ‌కుడిలో లేక‌పోతే సినిమాలో మాత్రం ఎక్క‌డి నుంచి వ‌స్తుంది. ద‌ర్శ‌కుడికి లేని ఆత్మ, సినిమాలో వుంటుందా?

జీఆర్ మ‌హ‌ర్షి

11 Replies to “మ‌ట్కాలో మ‌ట్కా లేదు”

  1. * గ్యా స్ ఆం ధ్ర లో.* గ్యా స్ త ప్ప. ఏ మీ లే దు., దాం తో పా టు జ గ న్

    వ్య తి రే కు లా పై వి షం. చిమ్మడo.

    1. Nenu ee madhyane kurukshethram movie lo konni part lu chusanu. chala bagundi.. abhimanyudu maranininchina tharavatha scene lo Krishna gari action superb.. chudani vallu aa scene chudandi you tube lo undi..thappakunda nachuthundi..

    1. అంతకుముందు వచ్చిన నెంబర్ లతో చార్ట్ లు ఉండేవి, ఆ చార్ట్ లు పట్టుకొని ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద చేస్తున్న విశ్లేషణలు లాంటివి చేస్తూ ఉండేవాళ్ళు లోకల్ ఎక్స్పర్ట్ లు!

  2. ఏ జట్కా నో గుట్కా నో ఉచితంగా ఇచ్చే చిట్కా ఉంటే మట్కా చూస్తారేమో…

Comments are closed.