యాడ్ మార్కెట్ లో స‌చిన్ ఒక్క‌డే ఆణిముత్యం!

బాలీవుడ్ సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు.. యాడ్ సామ్రాజ్యంలో రారాజులు. వీరి క్రేజ్ ను త‌మ బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం ఉప‌యోగించుకోవ‌డానికి కంపెనీలు పోటీలు ప‌డుతూ ఉంటాయి. కోట్ల రూపాయ‌లు పారితోషికాలు ఆఫ‌ర్ చేస్తూ వీరి చేత…

బాలీవుడ్ సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు.. యాడ్ సామ్రాజ్యంలో రారాజులు. వీరి క్రేజ్ ను త‌మ బ్రాండ్ ప్ర‌మోష‌న్ కోసం ఉప‌యోగించుకోవ‌డానికి కంపెనీలు పోటీలు ప‌డుతూ ఉంటాయి. కోట్ల రూపాయ‌లు పారితోషికాలు ఆఫ‌ర్ చేస్తూ వీరి చేత యాడ్స్ చేయించుకోవ‌డానికి కంపెనీలు ఉత్సాహం చూపుతుంటాయ‌నే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మంచి ఫామ్ లో ఉన్న క్రికెట‌ర్లు, వ‌ర‌స విజ‌యాల మీద ఉన్న బాలీవుడ్ స్టార్ హీరోలు త‌మ యాడ్ అగ్రిమెంట్ల‌తో పతాక శీర్షిక‌ల్లో నిలుస్తూ ఉంటారు. ఈ విష‌యాల్లో కూడా వారి స్టార్ డ‌మ్ మధ్య‌న పోలిక వ‌స్తూ ఉంటుంది. ఇదంతా తెలిసిన సంగ‌తే!

అయితే ఇప్పుడు బాలీవుడ్ సెల‌బ్రిటీలు అయితేనేం.. క్రికెట‌ర్లు అయితేనేం.. ఎలాంటి యాడ్స్ లో న‌టిస్తూ ఉంటార‌నే అంశం కూడా చ‌ర్చ‌లోకి వ‌స్తోంది. వ‌చ్చి ప‌డే కోట్ల రూపాయ‌లు సంగ‌త‌లా ఉంచితే, వీరు ఎలాంటియాడ్స్ లో న‌టిస్తున్నార‌నే విష‌యాన్ని సామాన్యులు కూడా విశ్లేషించుకుంటూ ఉన్నారు. సోష‌ల్ మీడియా విస్తృతం అయ్యాకా.. ఈ విష‌యంలో స‌ద‌రు హీరోల‌నూ, సెల‌బ్రిటీల‌ను నిల‌దీయ‌డానికి కూడా జ‌నాలు వెనుకాడటం లేదు.

ప్ర‌త్యేకించి పొగాకు ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేసే సెల‌బ్రిటీల పై ప్ర‌జ‌ల క‌న్ను ప‌డుతోంది. డైరెక్టుగా వీరు పొగాకు ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేయ‌రు. బ్రాండింగ్ ప్ర‌మోష‌న్ చేస్తారు. ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించే పొగాకు కంపెనీల తాలుకూ మ‌రో ఉత్ప‌త్తిని వీరు ప్ర‌మోట్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తారు. వ‌క్క ప‌లుకులు అంటారు, లేదా ఇలాచీ అంటారు. అయితే ఆ బ్రాండ్ లో అలాంటివి బ‌య‌ట దొర‌క‌వు. ఆ బ్రాండ్ లో దొరికే అస‌లు పొగాకు ఉత్ప‌త్తి ఏదో ఉంటుంది. బ్రాండ్ పేరును జ‌నాల్లోకి తీసుకెళ్లి.. అలా పొగాకు ఉత్ప‌త్తుల‌ను చేస్తున్నారు స్టార్లు!

ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. అమితాబ్, అజ‌య్ దేవ‌గ‌ణ్, షారూక్ ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్. అయితే వీరిలో తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాకా.. అమితాబ్, అక్ష‌య్ లు వెన‌క్కు త‌గ్గారు. తెలియ‌క తాము చిక్కుకున్న‌మ‌ని ర‌ద్దు చేసుకుంటామంటూ చేతులు కాలాకా ఆకులు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే చాలా మంది హీరోలు, క్రికెట‌ర్లు వీరిలో తెలుగు హీరోలు కూడా పొగాకు, మ‌ద్యం కంపెనీల‌ను ప్ర‌మోట్ చేస్తున్నారు. మ‌ద్యం కంపెనీల యాడ్స్ ను కొంద‌రు డైరెక్టుగా, మ‌రి కొంద‌రు సోడాల పేరుతో ప్ర‌మోట్ చేస్తున్నారు. మ‌ద్యం విష‌యంలో అయితే హీరోయిన్లు కూడా యాడ్స్ చేస్తున్నార‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

వీరి జాబితాను ఏక‌రువు పెడితే పెద్ద‌దే అవుతుంది. మ‌రి ఇంత మందిలో ఇప్ప‌టి వ‌ర‌కూ పొగాకు, మ‌ద్యం యాడ్స్ లో క‌నిపించ‌ని స్టార్ ఎవ‌రైనా ఉన్నారంటే అది స‌చిన్ టెండూల్క‌ర్ మాత్ర‌మే అని చ‌రిత్ర చెబుతోంది. ఒకానొక ద‌శ‌లో ఇండియ‌న్ యాడ్ మార్కెట్ లో టాప్ సేల్ స‌చిన్ టెండూల్క‌రే. స‌చిన్ నటించే యాడ్స్ కూడా ఒక రేంజ్ లో పాపుల‌ర్ అయ్యేవి. పెప్సీ, బూస్ట్ యాడ్స్ అయితే క‌ల్ట్ హిట్ అయ్యాయి. అదే ఊపులో బోలెడ‌న్ని యాడ్స్ లో స‌చిన్ క‌నిపించాడు. అప్ప‌ట్లోనే కోట్ల రూపాయ‌ల‌ను ఆర్జించాడు.

మ‌రి త‌న‌కు అలాంటి మార్కెట్ ఉన్నా.. స‌చిన్ మ‌ద్యం, పొగాకు ఉత్ప‌త్తుల‌ను మాత్రం ప్ర‌మోట్ చేయ‌లేదు. ఒకానొక ద‌శ‌లో టీమిండియాకు విల్స్ కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించింది. ఆ స‌మ‌యంలో కూడా స‌చిన్ అలాంటి వాటిని వ్య‌క్తిగ‌తంగా ప్ర‌మోట్ చేయ‌లేదు. అలాగే 20 కోట్ల రూపాయ‌ల యాడ్ డీల్ తో యూబీ గ్రూప్ సచిన్ ను సంప్ర‌దించినా దాన్ని ఆ  స్టార్ క్రికెట‌ర్ తిర‌స్క‌రించిన‌ట్టుగా అధికారికంగా వార్త‌లు వ‌చ్చాయి.

నయాత‌రం స‌చిన్ లు, న‌యాత‌రం యాడ్ మార్కెట్ రాజులు మాత్రం అలాంటి తీరుతో లేరు. ఇప్పుడు కొహ్లీతో స‌హా అనేక మంది మ‌ద్యం కంపెనీల‌ను ప్ర‌మోట్ చేస్తూ ఉన్నారు. వీలైనంత‌గా సంపాదించుకుంటున్నారు!