ఏప్రిల్ 24 ప్రత్యేకత ఏమంటే, ఈ సారి ఏమీ లేదు. ఎందుకంటే ఆంధ్రాలో ఇంకా స్కూళ్లు నడుస్తున్నాయి. పిల్లలు ఎండలకి మాడుతున్నారు. మా చిన్నప్పుడు ఈ డేట్ కోసం ఎదురు చూసేవాళ్లం. ఆఖరి సోషల్ పరీక్ష అయిపోగానే ఆనందంతో అరుస్తూ స్కూల్ అనే యమధర్మరాజు నుంచి పారిపోయేవాళ్లం.
పరీక్షలు రాసిరాసి అలిసిపోయాం కాబట్టి సాయంత్రానికి సినిమా చూడాలి. ప్రేమ, ఎమోషన్స్ , కుటుంబ కథాచిత్రాలు మాకు నిషిద్ధం. మాయలు, మంత్రాలు, కత్తి యుద్ధాలు, రాజకుమారి రామచిలుకగా మారితే, హీరో మాంత్రికుడితో యుద్ధం చేయాలి. అప్పుడే కిక్కు. ముక్కామలలా పొడుగాటి గౌను వేసుకుని చదువుకి బదులు మంత్రాలు నేర్చుకోవాలని నా కోరిక. మంత్రాల వల్ల లాభం ఏమంటే స్కూల్లోనే అయ్యవార్లని చిలుకలుగా మార్చి పంజరంలో పెట్టి ఆల్‌జీబ్రా నేర్పించొచ్చు. అపుడు గానీ వాళ్లకి మా బాధ తెలియదు.
ఒకసారి కత్తి కాంతారావు జ్వాలాదీప రహస్యం చూసే భాగ్యం కలిగింది. 10 మంది ఒక గుంపుగా సాయంత్రం బయల్దేరాం. గుంపుగా ఎందుకంటే సింగిల్‌గా వెళితే కుక్కలకి అలుసు. అవి గుంపుగా వెంటపడ్తాయి. థియేటర్ దగ్గర బోస్ అనే క్రిమినల్‌కి ఒక ఐడియా వచ్చింది. అందరి దగ్గర చెరో రూపాయి వుంది. 75 పైసలు టికెట్‌కి పోగా 10 పైసలకి సోడా, 10 పైసలకి శనక్కాయలు, ఐదు పైసలకి చెక్కిలం లెక్క సరిపోతుంది. అయితే వాడి ప్లాన్ ఏమంటే నేలకి వెళ్లి సినిమా స్టార్ట్ కాగానే బెంచీల్లోకి దూకేయాలి.
నేల 40 పైసలు కాబట్టి 35 పైసలు లాభం. మ్యాథ్స్‌లో లాభనష్టాల లెక్కలు చేయమంటే వాడికి అక్షరం రాదు కానీ, ఈ లాభం మాత్రం చిటికెలో తేల్చేశాడు. ఈ ప్లాన్‌కి నాతో పాటు ముగ్గురు ఒప్పుకోలేదు. గేట్ కీపర్‌కి దొరికితే తెలుగు, కన్నడంలో కలిపి తిడతాడు (మా వూరు రాయదుర్గం కర్నాటక బార్డర్). కొట్టచ్చు కూడా. మెజార్టీ వుంది కాబట్టి వాళ్లు 40 పైసల బుకింగ్‌లో దూరారు. వాళ్ల జేబు నిండా చిల్లర. 35 పైసలకి బొరుగులు, కలర్ సోడాలే కాకుండా బజ్జీలు వచ్చే కాలం. మనసు చలించింది కానీ. బుద్ధికి భయమేసింది.
మేము బెంచి క్లాస్‌కే వెళ్లాం. మా మిత్రులు నేలపై ఉఫ్‌మని ఊది కూచున్నారు. మాకు ఆ అవసరం లేదు. మార్క్సిజం చదవక ముందే మానవ జాతి చరిత్ర అంతా వర్గాలు, వర్గపోరాటాలే అని నాకు ఈ బెంచి నేల క్లాస్‌ల వల్లే తెలిసింది. సినిమా టైటిల్స్ తర్వాత ముక్కామల ఒక గండభేరుండ పక్షితో పోరాడుతూ వుండగా అదును చూసి ఒక్కొక్కడు నేల నుంచి బెంచికి జంపింగ్. రెండింటికి మధ్య ఒక సిమెంట్ దిమ్మె అడ్డు. సులభంగా దూకేశారు. ఆఖరి వాడు భయస్తుడు. గేట్ కీపర్‌కి దొరికిపోతాననే భయంతో వాడి వైపే చూస్తూ దూకాడు. చూడనే చూశాడు.
“లే దొంగ నా కొడుకా” అని వచ్చి పట్టుకున్నాడు.
“నేనే కాదు అనా, వీళ్లు కూడా” అని వాడు మా అందర్నీ చూపించాడు.
“లే, మీ నాయనా గంటు అనుకుండారా టేటర్ అంటే” అని మీదకి దూకాడు. మేము ఏడ్పు ముఖాలతో టికెట్ ఇచ్చామని, టికెట్ సగం ముక్క అడిగితే ఇవ్వలేదని వాదించాం. వాడు వినలేదు.
“లే, అందరూ నేలకి పోతారా, పయ్యి పగలల్లా” అని కన్నడ యాసలో అరిచాడు.
“పొయ్యి కూచుందాం రారా, వాడు కొట్టిన కొడతాడు” అని కథా నాయకుడు బోస్ అంటే, వాన్ని పచ్చి బూతులు తిట్టి బెంచి నుంచి నేలకు దూకాం. మాకు జరిగిన అన్యాయానికి వాళ్లు మిగిల్చిన డబ్బుల్లో మాకే ఎక్కువ ఖర్చు పెట్టారు. సినిమా అయిపోయాక నవ్వుతూ ఇంటికొచ్చాం. జరిగింది ఎవడికీ గుర్తు లేదు.
సమ్మర్ సెలవుల్లో స్పెషల్ ఈవెంట్ ఈత. ఊరి బయట తోటల్లోకి వెళ్లి ఒక పావలా ఇస్తే ఎన్ని గంటలైనా మునగొచ్చు. ఎపుడైతే ఊళ్లలోకి బోరు మిషన్లు వచ్చాయో, బావులు అప్పుడే మాయమైపోయాయి.
పుల్ల ఐస్ ఐదు పైసలు. సేమియా ఐస్ పది పైసలు. పుల్ల ఐస్ ప్రత్యేకత ఏమంటే సులభంగా కరగదు. 15 నిమిషాలు చప్పరి స్తూనే ఉండొచ్చు. ఇంకో ఆకర్షణ ఐసు బండి. ఐస్ గడ్డని పొడిచేసి రంగునీళ్లు చల్లి ఇచ్చేవాళ్లు. గోల్డ్‌స్పాట్‌లు , థమ్సప్‌లు తెలియని కాలం.
ఈగలు ముసిరిన కర్బూజ, పుచ్చకాయలు తినే అమాయకత్వం. ఎండలు లెక్క చేయకుండా గోలీలు, బొంగరాలు ఆడే బాల్యం. జూన్ 13 ఒక వినాశ దినం. స్కూళ్లు తెరుస్తారు. కష్టాల తర్వాత సుఖాలు వచ్చినట్టు మళ్లీ ఏప్రిల్ వచ్చేది.
ఏసీ గదుల్లో కూచుని అధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ సారి మే 9 వరకూ స్కూళ్లు. పిల్లలే కాదు, టీచర్లు కూడా వడదెబ్బ బారిన పడుతున్నారు.
-జీఆర్ మహర్షి