మోసాలు పలు రకాలు. మోసపోయేవాడు ఉండాలే కానీ, కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. కాకపోతే ఇది కొత్త మోసం కాదు, ఇలాంటి మోసాల్లో కొత్త రకం. ఐఏఎస్ ఆఫీసర్ని అంటూ ఏకంగా పోలీసుల్నే బురిడి కొట్టించాలని చూశాడు ఓ ప్రబుద్ధుడు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు, తాము బుక్కవ్వకుండా, సదరు నకిలీ ఐఏఎస్ నే బుక్ చేశారు. గుంటూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన.
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్. ఎప్పట్లానే సీరియస్ సాగుతోంది వ్యవహారం. ఇంతలో పోలీస్ స్టేషన్ ముందు ఖరీదైన కారు ఆగింది. అందులోంచి వెంకటేశ్వరరావు సీరియస్ గా దిగాడు. వడివడిగా ఎస్సై ఆరోగ్యరాజ్ దగ్గరకు వెళ్లాడు. తన చేతిలో ఉన్న ఖరీదైన ఫోన్ ను అతడి చేతిలో పెట్టాడు. ఐఏఎస్ ఆఫీసర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడమని హంగామా చేశాడు.
కూల్ గా ఫోన్ తీసుకున్న ఆరోగ్యరాజ్, హలో అన్నాడు. అట్నుంచి గంభీరంగా ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనరసింహమూర్తి మాట్లాడాడు. చేసింది ఐఏఎస్ కావడంతో ఆరోగ్యరాజ్ కూడా అలర్ట్ అయ్యాడు. అర్జెంట్ గా ఓ పెళ్లి ఆపాలని, మహిళా పోలీసులతో కలిసి అక్కడకు వెళ్లి పెళ్లి ఆపాలని, అమ్మాయిని రక్షించాలని ఫోనులో పురమాయించాడు సదరు ఐఏఎస్. కానీ ఎస్సై కంగారుపడలేదు. లిఖితపూర్వకంగా లేకపోతే ప్రొసీడ్ అవ్వలేమని చెప్పాడు. దీంతో తను ఉంటున్న హోటల్ కు రమ్మన్నాడు ఐఏఎస్.
హోటల్ కు వెళ్లిన ఎస్సై చేతిలో ఓ కాగితం పెట్టాడు ఐఏఎస్ లక్ష్మీనరసింహమూర్తి. ఆ లెటర్ హెడ్ చూసిన ఎస్సైకి అనుమానం వచ్చింది. వెంటనే డీఎస్పీకి సమాచారం ఇచ్చాడు. డీఎస్పీకి అనుమానం వచ్చి ఎడిషనల్ డీజీతో మాట్లాడారు. ఆయనకు కూడా అనుమానం రావడంతో విషయం తేల్చుకుందామని కొంతమంది పోలీసులు హోటల్ కు వెళ్లారు.
తనపై పోలీసులకు అనుమానం వచ్చిందని గ్రహించిన లక్ష్మీనరసింహమూర్తి అప్పటికే జంప్ అయ్యాడు. దీంతో అతడు నకిలీ ఐఏఎస్ అని నిర్థారణకొచ్చిన పోలీసులు, పూర్తిస్థాయిలో అలెర్ట్ అయ్యారు. అతడి ఫోన్ సిగ్నల్ ఆధారంగా విజయవాడ వెళ్లేదారిలో పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత అతడో పెద్ద వైట్ కాలర్ మోసగాడనే విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు.
లక్ష్మీనరసింహమూర్తి అరెస్ట్ అయ్యాడనే విషయం తెలుసుకొని ఇద్దరు బాధితులు గుంటూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. వీరిలో ఒకరు లక్ష్మినరసింహమూర్తికి 2 కోట్లు, మరొకరు కోటి 35 లక్షలు సమర్పించుకున్నారట. ఇక అమ్మాయి విషయానికొస్తే.. గతంలో ఆ అమ్మాయిని ఇతగాడు ప్రేమించాడట. దానికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమె పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతో పోలీసుల్ని పంపించాలని నకిలీ ఐఏఎస్ గా ప్లాన్ వేశాడు. గంటల వ్యవథిలోనే దొరికిపోయాడు. అతడి దగ్గర్నుంచి నకిలీ లెటర్ హెడ్స్, సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.