మంత్రులుగా ఎమ్మెల్సీలకు చోటు లేదా?

కొత్త కేబినెట్ కొలువు తీర‌డానికి కేవ‌లం 24 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అమాత్య ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి వ‌స్తాయ‌నే విష‌య‌మై 150 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పై క‌నిపిస్తున్నాయి. అయితే ఏ…

కొత్త కేబినెట్ కొలువు తీర‌డానికి కేవ‌లం 24 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. అమాత్య ప‌ద‌వులు ఎవ‌రెవ‌రికి వ‌స్తాయ‌నే విష‌య‌మై 150 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ర‌క‌ర‌కాల పేర్లు తెర‌పై క‌నిపిస్తున్నాయి. అయితే ఏ ఒక్క ఎమ్మెల్సీ పేరు అమాత్య రేస్‌లో ఉన్న‌ట్టు ప్రచారంలోకి రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

ఏపీలో ఎమ్మెల్సీల ప‌ద‌వులు కేవ‌లం అలంకారం కోస‌మేనా అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌మండ‌లిలో మొత్తం స‌భ్యులు 58 మంది స‌భ్యులున్నారు. 

ఇందులో వైసీపీకి 33 మంది, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి 15 మంది సంఖ్యా బ‌లం ఉంది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌లు ఎమ్మెల్యేలుగా గెల‌వ‌క‌పోయినా, మంత్రి వ‌ర్గంలో జ‌గ‌న్ చోటు క‌ల్పించారు. ఎమ్మెల్సీలు ప‌దవులిచ్చి న‌మ్మిన వాళ్లను జ‌గ‌న్ మ‌రిచిపోర‌నేందుకు వీళ్లిద్ద‌రిని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకునేవాళ్లు.

అయితే వాళ్లిద్ద‌రిని రాజ్య‌స‌భ‌కు పంప‌డంతో మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. వారి స్థానాల‌ను ఎమ్మెల్యేల‌తో భ‌ర్తీ చేశారు. తాజాగా కొత్త కేబినెట్ కొలువుదీర‌నున్న నేప‌థ్యంలో ఎమ్మెల్సీల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వుంటే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

త‌ద్వారా పెద్ద‌ల స‌భ‌కు గౌర‌వం ఇచ్చిన‌ట్టుగా ఉంటుంద‌ని చెబుతున్నారు. నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి, కే.రోశ‌య్య‌, మ‌ర్రి చెన్నారెడ్డి లాంటి నాయ‌కులు ఎమ్మెల్సీలుగా ఉంటూ ఉన్న‌త ప‌ద‌వులు అలంక‌రించ‌డాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.