ప్రభాస్ ఫ్యాన్స్ అంతే. తాము ట్రెండ్ చేసేది నిజమైనదా లేక అవాస్తవమా అనే విషయాన్ని అస్సలు పట్టించుకోరు. ఒక్కోసారి ఫేక్ న్యూస్ ను కూడా ట్రెండ్ చేసి పడేస్తుంటారు. రాధేశ్యామ్ విషయంలో ఓసారి ఇలానే జరిగింది, ఇప్పుడు సలార్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫేక్ న్యూస్ ను ఓ సెక్షన్ ప్రభాస్ ఫ్యాన్స్ వైరల్ చేసి పడేశారు.
మరో 4 రోజుల్లో కేజీఎఫ్2 రాబోతోంది. ఈ సినిమాతో పాటు సలార్ టీజర్ ను ప్రసారం చేస్తారనే ప్రచారం మొదలైంది. అంతే, దాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ అందుకున్నారు. కేజీఎఫ్ 2 తో సలార్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేశారు. దానికి సంబంధించిన పోస్టుల్ని వైరల్ చేశారు. చివరికి సలార్ మేకర్స్ రంగంలోకి దిగి అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
నిజానికి ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రం వెనక ఓ కారణం ఉంది. రాధేశ్యామ్ సినిమా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. రికార్డులు సృష్టిస్తుందనుకున్న ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ఆ అపజయాన్ని మరిపించేందుకు, ఇలా సలార్ ను 'ఆది'పురుష్ కి ముందే భుజానికెత్తుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
తమ హీరో సినిమాలకు సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా హంగామా చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో సలార్ రెండు భాగాలుగా వస్తోందన్నప్పుడు ఇలానే చేశారు. అంతకంటే ముందు రాధేశ్యామ్ ప్రమోషన్ ప్రారంభం కావట్లేదంటూ రచ్చ రచ్చ చేశారు. ఓ ప్రభాస్ అభిమానైతే ఏకంగా సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో పెట్టడం సంచలనమైంది.