ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. కొందరేమో కొత్త జిల్లాలు ఏర్పడటం మినహా ప్రజల జీవితాల్లో వచ్చే మార్పేంటి? అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. మరి కొందరేమో కొత్త జిల్లాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం వద్ద ఉన్న నిధులెన్ని అంటున్నారు. ఇంకొందరు.. రాజధాని లేని ఏపీలో ఇన్ని జిల్లాలా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఆ సంగతలా ఉంటే.. కొత్తగా జిల్లాగా ఏర్పడటం విషయంలో ఒక రేంజ్ లో ఉత్సాహం కనిపిస్తున్నది రాయలసీమలోని ఒక కొత్త జిల్లా కేంద్రం పరిసరాల్లో. అదే పుట్టపర్తి. సత్యసాయి జిల్లాగా.. పుట్టపర్తి జిల్లా కేంద్రం అయ్యింది. బహుశా రాష్ట్రంలోనే కొత్త జిల్లాగా ఏర్పడటం విషయంలో ఉత్సాహవంతంగా ఉన్నది పుట్టపర్తి జిల్లా ప్రాంత ప్రజలే!
దీనికి పలు కారణాలున్నాయి. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలనేది చాలా పాత డిమాండ్! దాదాపు రెండున్న దశాబ్దాల కిందటే పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ ఉంది స్థానికంగా. సత్యసాయి బాబా పుట్టపర్తి కేంద్రంగా తన ఆధ్యాత్మిక కార్యకలాపాలను సాగించారు. ఇప్పటికీ ఆ ఇమేజ్ ఉంది. ఆ కార్యకలాపాలూ సాగుతున్నాయి. పుట్టపర్తికి బస్ స్టాండును, రైల్వే స్టేషన్ ను, ఎయిర్ పోర్టును తీసుకు వచ్చిన సత్యసాయి బాబా.. పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలనే అంశంలోనూ సానుకూలంగా ఉండేవారు. స్థానికంగా అలా పుట్టపర్తి జిల్లా సెంటిమెంట్ బలంగా ఉండింది.
అయితే దానికి రాజకీయ మద్దతు మాత్రం లేకపోయింది. అనంతపురం జిల్లా కేంద్రంగానే కార్యకలాపాలు అన్నీ సాగాయి. జిల్లాల పునర్విభజనకు అప్పట్లో ఎవరూ పూనుకోకపోవడంతో…. పుట్టపర్తి జిల్లా ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అది నెరవేరింది.
ఇలా సుదీర్ఘ ఆకాంక్ష నెరవేరడం ఒక రకంగా సెంటిమెంట్ గా నిలుస్తోంది. ఇక రెండో విషయం.. జిల్లా ప్రకటనతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రావడం. పుట్టపర్తి నేషనల్ హైవేకు కాస్త సమీపంలో ఉంటుంది. బెంగళూరు నుంచి పుట్టపర్తికి ఉన్న దూరం సుమారు 140 కిలోమీటర్లు. దేవనహళ్లి ఎయిర్ పోర్టు నుంచి అయితే.. మరింత దగ్గర. బెంగళూరు నగరం దేవనహళ్లి, చిక్ బళాపూర్ ల దిశగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. పుట్టపర్తి, దాని ప్రాంతాలపై ఆ ప్రభావం కనిపిస్తోంది.
కియా కంపెనీ ఆవిర్భావంతో కూడా.. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో భూములకు డిమాండ్, ఆ మేరకు ధరలు పెరిగాయి. ఇలాంటి ఊపులో జిల్లా కేంద్రంగా మారడంతో.. రియలెస్టేట్ కు రెట్టింపు ఊపు వచ్చింది. పుట్టపర్తికి 20 కిలోమీటర్ల దూరంలో .. కూడా ఇప్పుడు ఎకరం భూమి అర కోటి రూపాయల పైనే చెబుతున్నారు. ఇక పుట్టపర్తి టౌన్లో ప్లాట్ లనూ, ఇళ్లను కలిగిన వారి పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు ధరలకు చేరాయి. ఇలా పుట్టపర్తి జిల్లా ఏర్పాటు ఉత్సాహాన్ని ఇస్తోంది స్థానికంగా.
పుట్టపర్తిలో చూట్టూ ఉన్న పల్లె ప్రజల పెట్టుబడులు గట్టిగా ఉన్నాయి. టౌన్లో ఏ స్థలమో కొనుక్కోవాలనే వారికి.. పుట్టపర్తి కొన్నేళ్లుగా మంచి వేదిక అయ్యింది. అలాంటి పుట్టపర్తికి జిల్లా ఇమేజ్, ఆ పట్టణం జిల్లా కేంద్రంగా మారడం.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఇలా కూడా సంతోష పెడుతోంది.
కొత్తగా ఏర్పడిన చాలా జిల్లాల్లో కూడా రియలెస్టేట్ కు ఊపు వచ్చి ఉండవచ్చు. ఆ ఉత్సాహం ఉండవచ్చు. అయితే పుట్టపర్తి విషయంలో మాత్రం ఉత్సాహం అనేక రెట్లు ఎక్కువ.
ఇక పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాల్సింది అంటూ హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఒక రోజో, ఒక పూటో ఆయన నిరసన కూడా చేపట్టారు. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టారు! అయితే హిందూపురం జిల్లా కావాలనే కోరిక ఆ టౌన్లో ఉండవచ్చు కానీ, అది ఏరకంగా జిల్లా కేంద్రంగా అనుకూలం కాదని స్థానికులందరికీ తెలుసు.
ఈ కనీస అవగాహన లేకుండా.. పవన్ కల్యాణ్ కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేసేశారు! అది చేశారు అంటూ, ఇలా ఎందుకు చేయలేదనే డొల్ల వాదనే తప్ప.. ఆ విషయంలో పవన్, బాలకృష్ణ ఇద్దరూ కమేడియన్లే అయ్యారు.