ఇప్పటికే రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ఉపయోగించుకుంటూ.. తనదైన రీతిలో తన సినిమాలను మార్కెట్ చేసుకున్నాడు దర్శక, నిర్మాత రామ్ గోపాల్ వర్మ. ఒక దశలో తను తెలుగులో సినిమాలు చేయనంటూ వెళ్లిపోయిన ఇతడు.. దాదాపు పుష్కర కాలం నుంచి దాదాపుగా తన మకాంను హైదరాబాద్ కు మార్చేశాడు. ఈ పన్నెండేళ్లలో వర్మ ప్రేక్షకులను మెప్పించిన సినిమాలేవీ తీయలేదు కానీ, బాగా విసిగించాడు.
ఆల్మోస్ట్ సగటు సినీ ప్రేక్షకులంతా వర్మను, వర్మ సినిమాలను లైట్ తీసుకునేంత వరకూ వచ్చింది వ్యవహారం. బాలీవుడ్ లో అయినా, టాలీవుడ్ లో అయినా.. వర్మ నుంచి నిఖార్సైన, మంచి సినిమా వస్తుందనే ఆశ ఎవ్వరికీ లేదు! చివరకు అతడి హార్డ్ కోర్ అభిమానులకు కూడా. వర్మ రేంజ్ ఇప్పుడు యూట్యూబ్ కు పరిమితం అయ్యింది. యూట్యూబ్ లో అతడి ఇంటర్వ్యూలకు వచ్చినన్ని వ్యూస్ కూడా అతడి సినిమాలకు వచ్చేలా లేవు!
దర్శకుడిగా, క్రియేటర్ గా వర్మ పతనావస్థ గురించి ఇంత ఉపోద్ఘాతం కూడా అక్కర్లేదు. ఆ సంగతలా ఉంటే.. మరోసారి రాయలసీమ చుట్టూ పరిభ్రమిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఈ సారి కూడా ఫ్యాక్షన్ కథనే నెత్తికి ఎత్తుకుంటున్నాడు. ఈ కథ కూడా కొత్తదేమీ కాదు. పన్నెండేళ్ల కిందట వర్మ వాడేసినదే! ఈ సారి వెబ్ సీరిస్ అట. ఈ కథను చెప్పడానికి వర్మ అండ్ కో విడుదల చెబుతున్న ఎత్తుగడ ఇలా ఉంది…
**గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్‌సిరీస్ ఓ కమ్యూనిస్ట్ నేత రాములును హత్య చేయడంతో ప్రారంభమవుతుంది. శ్రీరాములు కొడుకు హరి, ఓ విప్లవకారుడు. అడవిలో ఉండి గొరిల్లా తరహా పోరాటాన్ని భూస్వాములతో చేస్తుంటాడు. అతను తన తండ్రి మరణ వార్త విని ఆవేశంతో రగిలిపోతాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోని బలవంతులైన గుండాలకు, అతనికి జరిగే పోరాటం ఆసక్తి రేకెత్తిస్తుంది. తన తండ్రి మరణానికి కారకులైన వారిని కనిపెట్టడంతో పాటుగా వారిపై జరిపే పోరాటం ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మలుస్తుంది.**
ఇదీ వర్మ అండ్ కో వెబ్ సీరిస్ రూపంలో చెప్పబోతున్న కథ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం గురించి అవగాహన అక్కర్లేదు. కనీసం రక్త చరిత్ర సినిమాను ఒక అరగంట పాటు చూసిన వారికి కూడా కథా, కమామీషు ఏమిటో అర్థం అవుతుంది.
గతంలో సినిమాగా చెప్పిన కథనే ఇప్పుడు వర్మ అండ్ కో వెబ్ సీరిస్ అంటూ అల్లుతోంది. వీరప్పన్ గురించినే వర్మ రెండు సినిమాలు తీసినట్టుగా ఉన్నాడు. తన పాత సినిమా కథలనే కొత్తగా చెప్పే విషయంలో కూడా ఫెయిల్ అయ్యాడు. శివ, గాయం, క్షణక్షణం వంటి కథలను కూడా రీమేక్ అంటూ చెప్పకుండా రీమేక్ చేసి వర్మ ఆకట్టుకోలేకపోయాడు. అయితే పట్టు వదలకుండా ప్రయత్నించడం కూడా వర్మ కు అలవాటే.
గతంలో దెయ్యం సినిమాల కాన్సెప్ట్ తో ఎలాగైనా హిట్ కొట్టే ప్రయత్నం చేశాడు చాలా కాలం పాటు. అలా తీయగా తీయగా.. చివరకు ఆరేడు సినిమాల తర్వాత.. హిందీలో ఒక్క హారర్ మూవీతో ఆకట్టుకున్నాడు. అయితే వర్మలో గతంలో ఉన్న ఆ పట్టుదల కూడా ఉందని ఎవ్వరూ అనుకోవడం లేదు. పార్ట్ వన్ ఫ్లాఫ్ అయినా, పార్ట్ తీసే దర్శక, నిర్మాతే వర్మలో ఉన్నాడిప్పుడు. ఆ పైత్యానికి పరమార్థమే మళ్లీ రాయలసీమ ఫ్యాక్షన్ కథాంశాలతో ఇలాంటి వెబ్ సీరిస్ లు అల్లడం!
కొన్నేళ్ల కిందట.. కడప పేరుతో కూడా వర్మ ఒక వెబ్ సీరిస్ ను ఒకటీ రెండు ఎపిసోడ్లు తీసి, తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఆ తర్వాత.. దాన్ని కొనసాగించే ఆసక్తి కూడా లేక వదిలేశాడు. ఇప్పుడు మళ్లీ చలో అనంతపురం అంటున్నాడు.