ఓటుకి నోటు కేసు తర్వాత హైదరాబాద్ అనే పేరు పలకడానికే చంద్రబాబు వణికిపోయారు. ఆ భయంతోనే పదేళ్ల ఉమ్మడి రాజధానిని సైతం వదిలిపెట్టి రెండేళ్లకే పారిపోయి వచ్చేశారు. హైదరాబాద్ లో తన ఇంటికి వెళ్లినా కూడా మూడో కంటికి తెలియకుండా వెళ్లివస్తుంటారు.
తెలంగాణలో పార్టీ ఉంది కానీ, ఒక్కసారి కూడా బాబు, ఎన్టీఆర్ భవన్ కి వెళ్లిన దాఖలాలు లేవు. హైదరాబాద్ అన్నా, కేసీఆర్ అన్నా చంద్రబాబుకి అప్పటినుంచీ భయం ఏమాత్రం తగ్గలేదు. చివరకు జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా. అభ్యర్థుల్ని బరిలో దింపినా కూడా వారి తరపున ఒక్క మాట కూడా మాట్లాడలేని దయనీయ స్థితి బాబుది.
ఇప్పటి వరకూ కనీసం ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా ఓ సందేశం ఇచ్చిన పాపాన పోలేదు. ఇతర పార్టీలను విమర్శించడం పక్కనపెడితే.. సొంత పార్టీ గురించి కూడా బాబు సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు.
అలాంటి బాబుకి ప్రచారం చివరి రోజున ఎందుకో ధైర్యం వచ్చింది. తాను గొప్పలు చెప్పుకున్నా..ఇతరులు విమర్శించడానికి అవకాశం లేకుండా ప్రచారం ముగింపు రోజు మాత్రం అధికారికంగా ఓ ట్వీట్ వేసి మమ అనిపించారు.
“హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధికి టీడీపీ పునాదులు వేసింది, ప్రజా శ్రేయస్సు పట్ల మాకున్న ఆకాంక్ష ఫలితమే సైబరాబాద్, సాఫ్ట్ వేర్ రంగం ప్రస్థానం హైటెక్ సిటీ నుంచే మొదలైంది. అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ ఎయిర్ పోర్ట్, జీనోమ్ వ్యాలీ.. ఇలా మాటలకన్నా చేతల్లోనే ఎక్కువ చూపాం.
బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కి రప్పించాం, ఉపాధి కల్పించాం, సంపద సృష్టించాం, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాం. ఆ వెలుగులు మళ్లీ రావాలంటే టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించండం, సైకిల్ గుర్తుకి ఓటేయండి.” ఇదీ చంద్రబాబు స్వోత్కర్ష.
కనీసం ప్రత్యర్థి పార్టీలను పల్లెత్తు మాట అనే దమ్ములేని బాబుకి హైదరాబాద్ లో రాజకీయం ఎందుకు? ఎన్నాళ్లిలా సైబరాబాద్ పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటారు, వరదల్లో నగరవాసులు పడిన కష్టాలను ప్రస్తావించే ధైర్యం బాబుకి లేదా? ఎన్టీఆర్ ఘాట్ కూల్చేయండని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నప్పుడు కూడా బాబుకి నోట మాట రాలేదు, ట్వీట్ మాత్రమే వచ్చింది. ఆమాత్రం దానికి తెలంగాణలో వెన్నెముక లేని రాజకీయం చేయడం చంద్రబాబుకి అవసరమా?
చేవ చచ్చినప్పుడు చివరిదాకా అలాగే ఉండాలి.. తీరా చివరిరోజు, ప్రచారం ముగిసే దశలో.. ఇంకెవరూ తనని తిట్టలేరు అని నమ్మకం కుదిరిన తర్వాత, ట్విట్టర్లో ఓట్లు అడుక్కున్నారు బాబు. బాబుకి తెలంగాణ అంటే ఎంత భయమో, తెలంగాణలో టీడీపీ ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ.