సర్వేపల్లిలో వరుసగా రెండుసార్లు తనను ఓడించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాచుక్కూచున్నారు. కాకాణిపై ఆనందయ్య భుజాలపై గన్ పెట్టి కాల్చేందుకు సోమిరెడ్డి కొన్ని రోజులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.
ఈ రోజు కాకాణిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆనందయ్య మందుతో ఏకంగా రూ.120 కోట్లు సొమ్ము చేసుకోవాలని కాకాణి కుటిల ప్రయత్నం చేశారని కాకాణి ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ కృష్ణపట్నం ఆనందయ్య మందు చరిత్రాత్మకమైందన్నారు. మే 21 నుండి ఆనందయ్య మందును క్యాష్ చేసుకోవాలన్న తలంపుతో కాకాణి కుట్రలు మొదలు పెట్టారని విమర్శించారు.
శ్రేషిత టెక్నాలజీ వద్ద సైట్‌కొని ఇంటర్నెట్‌లో హోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసినట్లు ఆరోపించారు. శ్రేషిత కంపెనీలో డైరెక్టర్లు వైసీపీ నాయకులని ఆయన చెప్పుకొచ్చారు. సైట్‌లో రూ.15 పెట్టి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసరికి రూ.167 చేశారని మండిపడ్డారు.
ఆనందయ్య ఆవేశంతో వెనక్కి తీసుకున్నారని.. అయితే ఆనందయ్య కుమారుడు సెల్ఫీ వీడియోతో ఎమ్మెల్యే కాకాణి కంగుతిన్నారని సోమిరెడ్డి అన్నారు. కోటి మందికి ఆన్‌లైన్‌లో మందు అమ్మి రూ.120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాణి కుటిల ప్రయత్నం చేశారని ఆరోపించారు.
నకిలీ సైట్ క్రియేట్ చేసిన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలను నిలదీసే దమ్ము, ధైర్యం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎస్పీ, కలెక్టర్‌లకు లేదన్నారు.
ఒకవైపు ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేస్తారనే ప్రచారం జరుగుతుంటే, మరోవైపు సోమిరెడ్డి విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ.120 కోట్లు సొమ్ము చేసుకోవాలనే ఆరోపణల్లో నిజానిజాలేంటో కాకాణి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది.
ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు జనంలోకి వేగంగా వెళుతాయి. అంతిమంగా జగన్ ప్రభుత్వానికే నష్టం. ఈ వాస్తవాన్ని గ్రహించి కాకాణి మీడియా ముందుకు రావాల్సి ఉంది.