ఆంధ్రాలో తాలిబన్లు.. తెలంగాణలో గాడ్సేలు

ఆమధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాలిబన్ అనే పేరు జోరుగా వినిపించింది. టీడీపీ నాయకులు, వైసీపీ లీడర్లను.. ప్రతిగా, వైసీపీ నేతలు టీడీపీ జనాల్ని ఈ పేరు పెట్టి విమర్శలు చేశారు. చంద్రబాబు అయితే మరో…

ఆమధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాలిబన్ అనే పేరు జోరుగా వినిపించింది. టీడీపీ నాయకులు, వైసీపీ లీడర్లను.. ప్రతిగా, వైసీపీ నేతలు టీడీపీ జనాల్ని ఈ పేరు పెట్టి విమర్శలు చేశారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకేసి ఏపీని ఆఫ్ఘనిస్థాన్ చేశారంటూ నోటికొచ్చినట్టు వాగేశారు. పదాలు బాగున్నాయని వాడేశారు. ఇప్పుడు ఇలాంటిదే మరో పదం తెలంగాణ రాజకీయాల్లో పుట్టింది. అదే ''గాడ్సే''.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ గాడ్సే అనే పదం విరివిగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెసోళ్లను, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ నేతల్ని గాడ్సే..గాడ్సే అంటూ తిట్టుకుంటున్నారు. ఈ పదానికి ఆద్యుడు మాత్రం కేటీఆరే. ఆయన ఏమన్నారో ఓసారి చూద్దాం..

“ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తులకు కాంగ్రెస్ అగ్రతాంబూలం ఇస్తోంది. దానికి తార్కాణం పీసీసీ అధ్యక్ష ఎంపిక. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు గాంధీభవన్ లో గాడ్సేలు దూరారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్లు గురివింద గింజ సామెతను గుర్తుచేసుకుంటే మంచిది.”

ఇలా రేవంత్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు కేటీఆర్. దీనిపై రేవంత్ కూడా ఘాటుగా స్పందించారు. తనపై ప్రయోగించిన గాడ్సే పదాన్ని ఆయన టీఆర్ఎస్ నేతలకు, బీజేపీ నాయకులకు ఆపాదించారు.

“గాడ్సే వారసులు అమిత్ షా, నరేంద్ర మోడీ. కేసీఆర్ గాడ్ ఫాదర్స్ అమిత్ షా, నరేంద్ర మోడీ. 15 రోజులకు ఒకసారి ఢిల్లీకి వెళ్లి తన గాడ్ ఫాదర్స్ అయిన గాడ్సేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కేసీఆర్. ఆ గాడ్సేల ఆదేశాలతో కేసీఆర్ పనిచేస్తుంటే, కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు.”

ఇలా తెలంగాణ రాజకీయాల్లో గాడ్సే పదం పాపులర్ అయిపోయింది. మధ్యలో దూరిన బీజేపీ నేతలు కూడా గాడ్సే పదాన్ని తమకు గిట్టని వాళ్లపై వాడేస్తున్నారు. బహుశా.. హుజారాబాద్ ఎన్నిక ముగిసేవరకు ఈ పదం హవా కొనసాగుతుందేమో.