అసెంబ్లీ ఎన్నికలుగానీ, పార్లమెంట్ ఎన్నికలుగానీ వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ నేతలైనా యాక్టివ్ గా ఉంటారు. ప్రచారం చేస్తారు. ప్రెస్ మీట్స్ లో మాట్లాడుతుంటారు. సందర్భం కల్పించుకొని ప్రత్యర్థులను విమర్శిస్తుంటారు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నాయకులు సరిగ్గా కీలకమైన ఎన్నికల సమయంలో గమ్మున ఉండిపోతే అనేక అనుమానాలు కలుగుతుంటాయి. అలా అనుమానాలు రేకెత్తిస్తున్న నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ.
బీజేపీలో అసంతృప్తిగా ఉన్న రాములమ్మ కాంగ్రెస్ లో చేరింది. అయితే కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలో ఆమె అడ్రెస్ లేకుండా పోయింది. మీడియాలోనూ ఆమెకు సంబంధించిన ఏ సమాచారమూ రావడంలేదు. ఒకవేళ ఆమెకు అనారోగ్యంగా ఉన్నట్టయితే ఆ సమాచారం మీడియాలో రాకుండా ఉండదు. కాబట్టి కారణం అది కాకపోవచ్చు. కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఆమెను కలిసినట్లు, ప్రచారానికి రమ్మన్నట్లు దాఖలాలు లేవు.
ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరాక అధిష్టానం కూడా ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినట్లు కనబడటంలేదు. బీజేపీలో చేరకముందు ఆమె కాంగ్రెస్ లో ఉండేది. అప్పట్లో ఆమెకు కీలకమైన ప్రచార బాధ్యతలు అప్పగించారు. ప్రచార కమిటీకి చైర్ పర్సన్ గా కూడా చేశారు. కానీ ఈసారి ఆమె కాంగ్రెస్ లో చేరినప్పుడు ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు తనకు మెదక్ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని షరతు పెట్టిందట.
కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నవారు ఎంతటి వారైనా, తల పండిన సీనియర్లైనా సరే దరఖాస్తు పెట్టుకోవాలని, పరిశీలించి టిక్కెట్ ఇస్తామని పార్టీ నాయకత్వం షరతు పెట్టింది. చాలామంది ఆప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ విజయశాంతి దరఖాస్తు చేసుకోలేదని సమాచారం. దాంతో ఎంపీ ఎన్నికల్లో ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. బహుశా తన సీనియారిటీని, పాపులారిటీని నాయకత్వం గుర్తించలేదనే కోపం ఉందేమో. అందుకే సైలెంటుగా ఉండిపోయింది.
గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లోనూ ఆమె ఇలాగే అలిగింది. అప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆమె ఇంటికి వెళ్లి ప్రచారానికి రావాలని బతిమాలారు. అయినా కేర్ చేయలేదు. కానీ ఈసారి ఆమెను పట్టించుకొనే నాథుడే లేకుండా పోయాడు. ఆమె బీజేపీ నాయకులపై అసంతృపితో రగిలిపోతున్న సమయంలో అంటే 2022 లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన సేవలను పార్టీ కోసం ఎలా ఉపయోగించుకోవాలో పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ (అప్పట్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు), లక్ష్మణ్ కు తెలియాలని అన్నది. “పార్టీ నాకు బాధ్యత ఇచ్చినప్పుడు నేను ఏదైనా చేయగలను. ఎలాంటి బాధ్యత ఇవ్వకుండా, నేనేదో చేస్తానని ఎలా ఆశిస్తారు’’ అని ఆమె ప్రశ్నించింది.
విజయశాంతి ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించింది . “నేను ఎప్పుడూ అగ్ర పాత్రనే పోషిస్తాను. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మే’’ అని రాములమ్మ టైటిల్‌తో తన సినిమాను ఉద్దేశించి చెప్పింది. బహుశా కాంగ్రెస్ లో రీఎంట్రీ తరువాత అలాంటి అగ్ర పాత్ర ఆమెకు దక్కలేదు. ఆమెకు ఓపిక తక్కువ. ఏ పార్టీలో ఉన్నా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తితోనే ఉంటుంది. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఈమెను రాజకీయాల్లో ఏ పార్టీ కూడా పెద్దగా పట్టించుకోలేదు.
పార్టీల నుండి ఆమె ఆశిస్తున్న ప్రాధాన్యత ఆకాశమంత ఎత్తున ఉంటే పార్టీలు ఇస్తున్న ప్రాధాన్యత భూమిపైనే ఉంది. రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరని ఎవరికి వాళ్ళుగా తామే అవకాశాలను సృష్టించుకుని ఎదగాలన్న సూత్రం రాములమ్మకు తెలియకపోవచ్చు. రాజకీయాల్లో చేరిన కొత్తల్లో సినిమా గ్లామర్ పనిచేస్తుందేమో గానీ జీవితాంతం పనిచేయదు. ఆమె సినిమాల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. అందులో సందేహం లేదు. కానీ విజయశాంతి తాను ఇప్పటికీ టాప్ హీరోయిన్ నే అనే భ్రమల్లో ఉండిపోయింది. రాజకీయాలను రాజకీయాల్లా చూడాలి. ఆ పని ఆమె చేయలేదు.