పదేళ్లలో భద్రాచలానికి ఒక్కసారే…!

కేసీఆర్‌ అధికారంలో ఉండగా సెక్రటేరియట్‌కు గానీ, నేడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి గానీ వచ్చింది లేదు.

కేసీఆర్ ఓ డిఫరెంట్ పర్సనాలిటీ. ఆయన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడూ అంతే. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడూ అంతే. ఏ విషయాన్నీ పట్టించుకోనట్టుగా ఉంటారు. అహంకారంతో వ్యవహరిస్తారని అనిపిస్తోంది. కేసీఆర్ ఎక్కడికీ వెళ్లరు. ఎందుకో అర్థం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత బిజీగా ఉన్నా నెరవేర్చాల్సిన కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. కాని కేసీఆర్ వాటిని పట్టించుకోరు. ఈరోజు శ్రీరామ నవమి. తెలంగాణలో శ్రీరామ నవమి వైభవంగా జరిగేది భద్రాచలంలోనే. అక్కడ నిర్వహించే ఈ పండుగకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.

శ్రీరామనవమి నాడు భద్రాచలం రాములవారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు ఈ సంప్రదాయాన్ని పాటించారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లావారు కాబట్టి వారు కూడా వెళ్లారు. 2024 మార్చి 11న తొలిసారిగా భద్రాచలానికి రేవంత్ రెడ్డి వచ్చారు. ఇక కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉన్నారు.

కాని పదేళ్లలో ఆయన భద్రాచలానికి ఒక్కసారి మాత్రమే వెళ్లారు. 2016 ఏప్రిల్ 15న కేసీఆర్ భద్రాచలం వచ్చారు. సీతారామ చంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సతి సమేతంగా సమర్పించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి దంపతులతో పాటు కోడలు, మనుమడు వచ్చారు. ఇక ఆ తర్వాత కేసీఆర్ ఇంకెప్పుడూ సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించలేదు. పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి సతీమణి, ఆమె కోడలు, మనవడు మాత్రమే స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.

కేసీఆర్ భద్రాచలం రాకపోవడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఈ అంశంపై పదేపదే కేసీఆర్ ను టార్గెట్ చేశారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డే పలు సందర్భాల్లో సీతారామచంద్రస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కాని కేసీఆర్ మరెప్పుడూ శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లలేదు. అందుకు కారణమేమిటో తెలియదు. కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన అసెంబ్లీకి వెళ్లని తీరు చూస్తున్నాం కదా. కాంగ్రెసు ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వెళ్లారు.

కేసీఆర్‌ అధికారంలో ఉండగా సెక్రటేరియట్‌కు గానీ, నేడు ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీకి గానీ వచ్చింది లేదు. అప్పట్లో ప్రగతి భవన్లో రెస్టు తీసుకునేవారు. ఇప్పుడు ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అధికారపక్షమే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని కోరినా, రాననే పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు సైతం కేసీఆర్‌ అసెంబ్లీకి రావటానికి విముఖత చూపుతున్నారు.అసెంబ్లీకి రావటం లేదు కానీ జీతభత్యాలు మాత్రం ఠంచన్‌గా తీసుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకునిగా కేసీఆర్‌ డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా 58.8లక్షల రూపాయలు జీతంగా తీసుకోగా, జూలై 25, 2024న ఒకే ఒక్కరోజు శాసనసభకు హాజరు అయ్యారు, అటెండెన్స్ రిజష్టర్‌లో సంతకం పెట్టి వెళ్లిపోయారు.

ఇటీవల ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై చర్చించడానికి ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించింది. ఈ సమావేశం ఒక చారిత్రాత్మకమైనది. ఈ సమావేశానికి హాజరై ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌ తన అమూల్యమైన సలహాలను, సూచనలను అందిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన ఈ సమావేశాలకు హాజరుకాలేదు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మరణం సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరు నాయకులు వెళ్లి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర క్యాబినెట్‌, దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నేతలందరూ వారి అంత్యక్రియలకు హాజరయ్యారు. కేసీఆర్‌ మాత్రం ఫామ్‌హౌస్‌ను దాటి బయటకు రాలేదు. తెలంగాణ బిడ్డ, తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన సందర్భంలో సైతం కేసీఆర్‌ ఇదేవిధంగా వ్యవహరించారు.

అప్పుడు కేంద్రమంత్రి అయిన కేసీఆర్‌, పీవీ అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఢిల్లీలోనే ఉన్నారు తప్ప కనీసం వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించలేదు. 2004లో కేసీఆర్‌ కేంద్ర కార్మికమంత్రిగా పనిచేశారు. మంత్రులు తప్పనిసరిగా సభకు హాజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలివ్వాల్సి ఉండగా, కేసీఆర్‌ పార్లమెంట్‌కు వెళ్ళేవారు కాదు. సభ్యుల ప్రశ్నలకు కేబినెట్‌ మంత్రి కేసీఆర్‌కు బదులుగా, సహాయమంత్రి సమాధానాలివ్వడంపై స్పీకర్‌ సోమనాథ్‌ చటర్జీ అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు మీ మంత్రి కేసీఆర్‌కు బదులుగా మీరు సమాధానాలు ఎందుకు చెబుతున్నారని, మీ మంత్రి సభకు ఎందుకు రావడం లేదని సభా వేదికగా ప్రశ్నించినా, కేసీఆర్‌లో ఎటువంటి చలనం రాలేదు.

ముఖ్యమంత్రి అయిన ఏడాదిలో రేవంత్‌రెడ్డి రెండుసార్లు దావోస్‌, సింగపూర్‌లో సదస్సులకు హాజరై రికార్డు స్థాయిలో రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు. కానీ కేసీఆర్‌ ఒక్కసారి కూడా ఇలాంటి సదస్సులకు హాజరు కాలేదు. రాష్ట్రంలో జరిగే ఎగ్జిబిషన్లు, పారిశ్రామిక సమ్మిట్లకు ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎప్పుడూ హాజరుకాలేదు. తన కొడుకును వీటికి పంపించేవారు. కేసీఆర్ వైఖరి ఓ పట్టాన అర్థంకాదు. ఆయన ఎవరిని ఎప్పుడు ఎందుకు దూరం పెడతారో, ఎవరిని ఎప్పుడు ఎందుకు దగ్గరకు తీస్తారో కూడా తెలియదు. కేసీఆర్ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. పార్టీ నాయకులకే ఆయన అర్థం కాడు.

9 Replies to “పదేళ్లలో భద్రాచలానికి ఒక్కసారే…!”

  1. తెలంగాణ జాతిపిత వేరొకరి పెళ్ళికి వెళ్లడమా, అది రాముడైనా, శివుడైనా ఎవరికీ లెక్క?

Comments are closed.