టారిఫ్ ల దెబ్బ‌.. భారీగా పెర‌గ‌నున్న ఐ ఫోన్ రేటు!

ప్రభుత్వాలు, దేశాలు, కంపెనీల మ‌ధ్య‌న ఎలాంటి వాణిజ్య వైరాలు జ‌రిగినా అంతిమంగా ఆ ప్ర‌భావం ప‌డేది వినియోగ‌దారుల మీదే!

ప్రభుత్వాలు, దేశాలు, కంపెనీల మ‌ధ్య‌న ఎలాంటి వాణిజ్య వైరాలు జ‌రిగినా అంతిమంగా ఆ ప్ర‌భావం ప‌డేది వినియోగ‌దారుల మీదే! ప్ర‌త్యేకించి ప్ర‌పంచీక‌ర‌ణ యుగంలో ఈ ప్ర‌భావాలు.. మ‌రింత వేగంగా ప‌డ‌తాయి! అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ మొన్న తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌భావం రేపోమాపో అమ‌లాపురంలో జ‌రిగే వ్యాపారం మీద కూడా ప‌డుతుంది! అందుకు తేలిక‌గా అర్థ‌మ‌య్యే ఉదాహ‌ర‌ణ ఐఫోన్!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌తి యేటా 22 కోట్ల ఐఫోన్ల‌ను అమ్ముతోంది యాపిల్. ఇది అమెరిక‌న్ ఐకాన్. ప్ర‌పంచానికి అమెరికా గొప్ప‌గా చెప్పుకోగ‌ల కంపెనీ యాపిల్. ఇప్పుడు అదే సంస్థ ట్రంప్ నిర్ణ‌యాల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. ఇప్ప‌టికే ట్రంప్ విధించిన దిగుమ‌తి సుంకాల ప్ర‌క‌ట‌న అప్పుడే అమెరిక‌న్ షేర్ మార్కెట్ లో యాపిల్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ట్రంప్ ప్ర‌క‌టించిన టారిఫ్ ల మ‌రుస‌టి రోజున యాపిల్ అక్ష‌రాలా 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన షేర్ల న‌ష్టాన్ని చూసింది! ఇది ఇండియా యూనియ‌న్ బ‌డ్జెట్ లో ఆరు నెల‌ల కాలానికి స‌మానం దాదాపు! ఒక్క రోజులో యాపిల్ ఆ మేర‌కు న‌ష్టాలు చూసింది!

ఆ సంగ‌త‌లా ఉంటే.. టారిఫ్ ఫ‌లితంగా ఐ ఫోన్ రేటు కూడా భారీగా పెర‌గ‌బోతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ట్రంప్ విధించిన టారీఫ్ ల కేట‌గిరిలో చైనా కూడా ముందు వ‌ర‌స‌లో ఉంది. చైనా నుంచి దిగుమ‌తులపై 56 శాతం మేర ట్రంప్ వ‌డ్డింపు ఉంది! యాపిల్ కూడా చైనా దిగుమ‌తుల మీద ఆధార‌ప‌డిన ప‌రిశ్ర‌మే! ఆ ఫ‌లితం ఉంటుంద‌నే ముందుగానే షేర్ మార్కెట్ పెట్టుబ‌డిదారులు యాపిల్ షేర్ల‌ను వ‌దిలించుకునేందుకు పోటీలు ప‌డ్డారు. దీంతో ఒక‌రోజు ఏకంగా 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల స్థాయిలో యాపిల్ ప‌డింది. మ‌రి ఇప్పుడు వినియోగ‌దారుల‌పై కూడా ఆ ప్ర‌భావం త‌ప్పేలా లేదు.

ప్ర‌పంచ వ్యాప్తంగా యాపిల్ ఫోన్ల రేట్లు పెరిగేలా ఉన్నాయి. బ‌హుశా ఐ ఫోన్ 17 విడుద‌ల‌తోనే ఆ ప్ర‌భావం మార్కెట్ లో క‌నిపించ‌వ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి ఎంత మేర పెరుగుతుంది? అంటే.. ప్ర‌స్తుతం ఐఫోన్ 16 విలువ ఇండియాలో 79 వేల రూపాయ‌లుగా ఉంది. ఆఫ‌ర్ల‌ను ప‌క్క‌న పెడితే, అది ధ‌ర‌. టారీఫ్ ల నేప‌థ్యంలో.. దీని విలువ క‌నీసం ఇర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కూ పెరుగుతుంద‌ని అంచ‌నా!

అంటే ట్రంప్ విధించిన అద‌న‌పు దిగుమ‌తి ప‌న్నుల వ‌ల్ల ఒక్కో సాధార‌ణ ఐఫోన్ ధ‌ర ఇర‌వై వేల రూపాయ‌లు పెరుగుతుంది! మ‌రి ఐ డివైజ్ ల‌లో లో అనేక రకాలు ఉన్నాయి, వాటిపై కూడా ఈ మేర‌కు ధ‌ర పెరుగుతుంది. బేసిక్ ఐ ఫోన్ మీదే ఇర‌వై వేల రూపాయ‌లు పెర‌గ‌డం అంటే మాట‌లు కాదు! అందునా.. ఇండియాలో ఇవ్వాళా రేపు ఐ ఫోన్ వినియోగ‌దారులు బాగా పెరిగారు. ఇప్పుడు ఇండియాలో అమ్ముడ‌వుతున్న ప్ర‌తి మూడు ఫోన్ల‌లోనూ ఒక‌టి ఐ ఫోనేన‌ట‌! మిగ‌తా ఫోన్ల రేట్లు కూడా బాగా పెర‌గ‌డం, ఐ ఫోన్ ను స్టేట‌స్ సింబ‌ల్ గా ఇండియ‌న్లు భావించ‌డం వ‌ల్ల‌.. దానికి తోడు వినియోగం కూడా సాఫీగా ఉండ‌టం వ‌ల్ల అనేక మంది ఐ ఫోన్ వైపు మొగ్గుచూపుతూ ఉన్నారు.

ప్ర‌స్తుతం ఐ ఫోన్ మేకింగ్ విష‌యంలో యాపిల్ మూడు దేశాల మీద ప్ర‌ధానంగా ఆధార‌ప‌డుతూ ఉంది. అందులో చైనా, వియ‌త్నాం, ఇండియా ఉన్నాయి. చైనా నుంచి దిగుమ‌తుల‌పై ట్రంప్ 56 శాతం టారీఫ్ విధించాడు. వియ‌త్నాం 46 శాతం కేట‌గిరిలో ఉంది, ఇండియా 26 శాతం కేట‌గిరిలో ఉంది! ఈ లెక్క‌ల నేప‌థ్యంలోనే ప్ర‌తి ఫోన్ విలువా ఇర‌వై వేల రూపాయ‌ల వ‌ర‌కూ పెరుగుతుంద‌ని అంచ‌నా.

అయితే ఇలాంటి స‌మ‌యాల్లో కొన్ని కంపెనీలు త‌ట్టుకుని నిల‌బ‌డ‌తాయి, మ‌రి కొన్ని దుంప‌నాశ‌నం అవుతాయి కూడా! ఇప్పుడు పెరుగుతున్న ఇర‌వై వేల రూపాయ‌ల ధ‌ర‌కూ ఐ ఫోన్ వాడ‌కం దార్లు ఓకే అనుకుంటే ఫ‌ర్వాలేదు, అంత ధ‌ర ఎందుకంటే.. ఐ ఫోన్ స్థానాన్ని ఏ సౌత్ కొరియ‌న్ కంపెనీనో, లేదా చైనా కంపెనీనో ఆక్యుపై చేసే అవ‌కాశాలు ఉండ‌నే ఉంటాయి! మ‌రి ట్రంప్ నిర్ణ‌యాలు అంతిమంగా యాపిల్ వంటి సంస్థ‌నే కాకుండా, అనేక అమెరిక‌న్ ఐకానిక్ కంపెనీల‌ను కూడా పరీక్ష‌కు నిల‌బెడుతూ ఉన్నాయి. ఈ పరీక్ష‌ల‌కు అవి ఏ మేర‌కు త‌ట్టుకుంటాయో కాల‌మే స‌మాధానం ఇవ్వాల్సి ఉంది!

4 Replies to “టారిఫ్ ల దెబ్బ‌.. భారీగా పెర‌గ‌నున్న ఐ ఫోన్ రేటు!”

Comments are closed.