శాసనమండలి చైర్మన్ కాంగ్రెసు నాయకుడా?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటినుంచి గుత్తా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం పూర్తికావొస్తోంది. ఇంకా కొంతకాలమే ఉంది. వాస్తవానికి ఆయన బీఆర్ఎస్ నాయకుడు. ఆ పార్టీ నుంచే మండలి చైర్మన్ అయ్యారు. మండలి చైర్మన్ పదవి ఆరేళ్లు కాబట్టి బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం పదవిలో కొనసాగుతూనే ఉన్నారు.

ఎందుకంటే శాసనమండలి శాశ్వత సభ కాబట్టి. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయినప్పటినుంచి గుత్తా ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే పదవీకాలం పూర్తయ్యాక కాంగ్రెసులో చేరే అవకాశం ఉందనిపిస్తోంది. వాస్తవానికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడకూడదు.

ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడకూడదు. ప్రతిపక్షాన్ని విమర్శించకూడదు. కాని అలా ఎవరు చేస్తున్నారు? రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు. విమర్శలు చేస్తూనే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ను, దాని అధినేత కేసీఆర్‌ను విమర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా కూడా ఘాటైన విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు హీరో కాదన్నారు. హీరో అయితే ప్రజలు ఆయన పార్టీకి ఓట్లెందుకు వేయలేదని ప్రశ్నించారు.

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కుమారుడు కేటీఆర్ “కేసీఆర్ కడుపున పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. అదృష్టం. కేసీఆర్ నాకు ఒక్కడికే హీరో కాదు. నాలుగుకోట్లమంది తెలంగాణ ప్రజలకు హీరో” అన్నాడు. దీనిపై గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్ చేస్తూ కేసీఆర్ హీరో అయితే ప్రజలు ఎందుకు ఓడించారని అన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, అధికారం లేదనే బాధతో ఆ పార్టీవారు మాట్లాడుతున్నారని అన్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెసులోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హ త వేటు పడుతుందని, ఉప ఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ ఆశపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కేటీఆర్ కోరుకున్నంతమాత్రాన ఉప ఎన్నికలు రావని గుత్తా అన్నారు. ప్రభుత్వం చేసిన కుల గణనపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా కులగణనను ప్రభుత్వం వందశాతం సరిగ్గానే చేసిందని గుత్తా అన్నారు.

దేశంలోనే బీసీల కులగణన తెలంగాణలోనే మొదటిసారి జరిగిందని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సమగ్ర కుటుంబ సర్వేకు అధికారిక రికార్డు లేదన్నారు. ఆ సర్వేను అసెంబ్లీలో పెట్టివుంటే అధికారిక రికార్డు ఉండేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనను మెచ్చున్నారు. మొత్తం మీద గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెసు నాయకుడిలా మాట్లాడుతున్నారు.

3 Replies to “శాసనమండలి చైర్మన్ కాంగ్రెసు నాయకుడా?”

  1. కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా,, సున్నా, నాలుగు

Comments are closed.