మీకు.. మీ పార్టీకి ఓ దండం

సొంత పార్టీపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న ముఖ్య అనుచ‌రుడిని చంప‌డంపై ఆయ‌న తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఘాటు వ్యాఖ్య‌లు…

సొంత పార్టీపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న ముఖ్య అనుచ‌రుడిని చంప‌డంపై ఆయ‌న తీవ్ర ఆవేద‌న‌, ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఘాటు వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.

జ‌గిత్యాల రూర‌ల్ మండ‌ల జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ స‌భ్యుడు గంగారెడ్డి (58)ని దారుణంగా హ‌త్య చేశారు. హ‌త్య‌ను నిర‌సిస్తూ అనుచ‌రుల‌తో క‌లిసి జ‌గిత్యాల -ధ‌ర్మ‌పురి మార్గంలో జీవ‌న్‌రెడ్డి ధ‌ర్నాకు దిగారు. జ‌గిత్యాల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి జీవ‌న్‌రెడ్డి చేరుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌భుత్వ విఫ్‌, ధ‌ర్మ‌పురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

‘ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకునైనా సేవ చేస్తా. ఇక మీకు.. మీ పార్టీకి ఓ దండం. ఇకనైనా మమ్మల్ని బతకనివ్వండి. ఇంతకాలం అవమానాలకు గురైనా తట్టుకున్నాం. అవమానాలకు గురవుతున్నా భరిస్తూ వ‌చ్చాం. కానీ ఇవాళ భౌతికంగా లేకుండా చేస్తే ఎందుకు’అని త‌న ద‌గ్గ‌రికి వ‌చ్చిన ప్ర‌భుత్వ విఫ్ అడ్లూరి లక్ష్మణ్‌ను జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకుల్నే దారుణంగా హత్య చేసిన తర్వాత అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేవా? అని ఆయ‌న నిల‌దీశారు. ముఖ్య అనుచరుడిని హత్య చేయడంతో తీవ్ర భావోద్వేగానికి గురైన జీవ‌న్‌రెడ్డి, తనను కూడా హత్య చేసినట్లే అని కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తే చంపేస్తారా అని ఆయ‌న ప్రశ్నించారు. నిందితుల్ని వెంట‌నే పట్టుకోవాలని పోలీసులను ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు.

మ‌రోవైపు కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ ఈ హ‌త్య‌పై స్పందించారు. వెంట‌నే నిందితుల్ని ప‌ట్టుకోవాల‌ని పోలీసుల్ని కోరారు. జ‌గిత్యాల జిల్లాలో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగే చ‌ర్య‌ల్ని ఎంత మాత్రం స‌మ‌ర్ధించేది లేద‌ని ఆయ‌న అన్నారు.

ఇదిలా వుండ‌గా నాలుగు నెల‌ల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. త‌న‌కు మాట మాత్రం కూడా చెప్ప‌కుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేరుకోవ‌డం ఏంట‌ని నిల‌దీసిన సంగ‌తి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని సీఎం రేవంత్‌రెడ్డిని అప్ప‌ట్లో జీవ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ నేప‌థ్యంలో త‌న ముఖ్య అనుచ‌రుడిని బీఆర్ఎస్ నుంచి వ‌చ్చిన వారే హ‌త్య చేశార‌నేది జీవ‌న్‌రెడ్డి ఆరోప‌ణ‌, ఆవేద‌న‌. సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.

One Reply to “మీకు.. మీ పార్టీకి ఓ దండం”

Comments are closed.