వచ్చే నెల 13న జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఒక ప్రముఖ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో … ఏపీలో అధికారంపై కేసీఆర్ మనసులో మాట బయట పెట్టారు.
“గతంలో మీరు తెలుగుదేశం జమానాలో పని చేశారు. పాత పార్టీకి చెందిన మిత్రుడు చంద్రబాబునాయుడు గెలవాలా? యువకుడు, మీ సన్నిహితుడైన జగన్‌మోహన్‌రెడ్డి గెలవాలా? మీ ఆలోచన ఏంటి? అక్కడ ఏం జరుగుతుందని అనుకుంటున్నారు?” అని యాంకర్ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కేసీఆర్ కుండబద్ధలు కొట్టినట్టు సమాధానం చెప్పారు. “అక్కడ (ఏపీ) ఏం జరిగినా మాకు పట్టింపు లేదు. మాకొస్తున్న సమాచారం ప్రకారం మళ్లీ జగనే గెలుస్తారు. ఎవరు గెలిచినా మాకు బాధ లేదు” అని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారనే కేసీఆర్ అభిప్రాయం వైసీపీలో మరింత జోష్ నింపనుంది. అలాగే కూటమిని కేసీఆర్ కామెంట్స్ నైతికంగా దెబ్బ తీసేలా ఉన్నాయి.
ఇప్పటికే మెజార్టీ సర్వేలన్నీ జగన్‌దే మరోసారి అధికారం అని తేల్చి చెప్పాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అభిప్రాయం వెల్లడించడం విశేషం. అయితే జగన్‌తో తన స్నేహం దృష్ట్యా కేసీఆర్ మద్దతుగా మాట్లాడ్డారని కూటమి నేతలు విమర్శలు చేయొచ్చు. కానీ జగన్‌తో స్నేహం కారణంగా కేసీఆర్ అలా చెప్పారనే భావన ఆయన మాటల్లో ఏ మాత్రం కనిపించలేదు.
తోదిమ్మిదేళ్లకు పైగా తెలంగాణ సీఎంగా పని చేసిన కేసీఆర్, వివిధ వ్యవస్థల్లో తనకున్న పరిచయాల రీత్యా ఏపీలో అధికారంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏపీలో ప్రజాభిప్రాయాన్నే కేసీఆర్ కామెంట్స్ ప్రతిబింబించాయనే వాళ్లే ఎక్కువ.