ఇప్పటి రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను ఆపడం ఎవరి తరమూ కాదు. నైతికంగా తప్పని చాలా మంది అంటారు. కాని పొలిటికల్ లీడర్స్‌కు రాజకీయ జీవితం, పదవులు సంపాదించుకోవడమే ప్రధానంగా కాని నైతికత అంటూ ఎవరూ మడి కట్టుకొని కూర్చోరు. అనర్హత వేటు పడటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కోర్టుకెళ్లినా ఏమీ కాని సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు కావొచ్చు, ఎమ్మెల్యేలు కావొచ్చు అధికారంలో ఉన్న పార్టీలోకే వెళతారు. అధికార పార్టీ కూడా ప్రతిపక్షాలను బలహీనపరచడానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.
ఇప్పడు తెలంగాణలో కాంగ్రెసు పార్టీకి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కొందరు చేరారు. మరికొందరు చేరబోతున్నారు. ఇంకా కొందరు ఆలోచిస్తున్నారు. కొందరు ఇప్పటికే కాంగ్రెసు పెద్ద సార్లతో టచ్లో ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెసు పార్టీలో చేరినవారిలో కొందరు గతంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వాల్లో పనిచేసిన వారే. కీలక మంత్రి పదవులు నిర్వహించినవారే.
ఎమ్మెల్యేల చేరికతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డీలా పడిపోతున్నాడు. పార్టీ మారగా మిగిలిన ఎమ్మెల్యేలను అధినేత బుజ్జగిస్తున్నాడు, బతిమిలాడుతున్నాడు. ఏవేవో పిట్ట కథలు చెబుతున్నాడు. కథలు వింటున్నారు. కాని వారి ప్రయత్నాల్లో వారున్నారు.
పార్టీ మారుతున్నవారు తాము బేషరతుగానే చేరుతున్నామంటున్నారు. కొందరు నియోజకవర్గం అభివృద్ధి కోసమే చేరుతున్నామంటున్నారు. ఇది కేవలం పైకి చెప్పేది మాత్రమే. షరతులు పెడతారు. మంత్రి పదవో, మరో పదవో కావాలని అడుగుతారు. పదవి ఇచ్చేది, ఇవ్వంది ఆ నియోజకవర్గంలో నాయకుడి బలం మీద, పలుకుబడి మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెసు పార్టీలో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉదాహరణకు… దానం నాగేందర్ గతంలో కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. తాను ఆల్రెడీ కాంగ్రెసు ప్రభుత్వంలో మంత్రిగా చేశాను కాబట్టి మళ్లీ మంత్రి పదవి వస్తుందని ఆశించాడు. కాని అలాంటిది జరగలేదు.
వాస్తవానికి మంత్రి వర్గాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. భర్తీ చేయాల్సిన మంత్రి పదవులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి దీని విషయం మాట్లాడి వచ్చాడు కూడా. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వొద్దని అధిష్టానం చెప్పినట్లుగా ఉంది. దీంతో కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పాడు.
కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలంటే పార్టీ బీఫారం మీద గెలిచిన వాళ్లని అర్థం. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇస్తే ఒరిజినల్ కాంగ్రెసు ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతుంది. దీంతో అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి కాంగ్రెసు పార్టీలోకి వచ్చినవారికి మంత్రి పదవులు ఉండవని రేవంత్ రెడ్డి చెప్పాడు. ఇస్తే గిస్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తాడు. పార్టీ మారిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఖాళీగా ఉండాల్సిందే.