బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ అధ్యక్షతన ఆ పార్టీ రాజకీయ తీర్మానం చేయడంతో.. ఏపీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రజా సంఘలు, రాజకీయ పార్టీలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేయగా తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సీఎం చంద్రబాబుని ట్వీట్టర్ వేదికగా షర్మిల కోరారు.
బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోడీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా ? రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా ?
హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు…రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం. అంటూ ట్వీట్ చేశారు.
కాగా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఎన్నో పార్టీలు భాగస్వాములుగా ఉన్నా ప్రధానంగా ఆ ప్రభుత్వాన్ని మోస్తున్నది రెండు పార్టీలే అని చెప్పొచ్చు. ఒకటి బీహార్‌లోని జేడీయూ పార్టీ, రెండోది ఏపీలో టీడీపీ. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు అత్యధిక స్థానాలు సాధించడంతో మోడీ ప్రభుత్వం ఈ రెండు పార్టీల ఊతంతోనే నిలబడాలి. ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్కటి కూటమిలోనుంచి వెళ్ళిపోయినా మోడీ గవర్నమెంటు మైనారిటీలో పడిపోతుంది. ఈ సంగతి చంద్రబాబు నాయుడికి అండ్ నితీష్ కుమార్ కు బాగా తెలుసు. వాళ్ళ డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఇదే సరైన సమయం.
మోడీ సర్కారు ఏర్పడి ఇంకా నెల రోజులు కాలేదు. ఇంకా పూర్తిగా కుదుటపడనేలేదు. అప్పుడే నితీష్ తన అస్త్రాన్ని బయటకు తీసి ప్రమాద ఘంటికలు మోగించాడు. బీహార్ కు ప్రత్యేక హోదా లేదా ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు పార్టీ తీర్మానం ఆమోదించింది. దీంతో ఏపీలో అందరి వేళ్లు చంద్రబాబు వైపే చూపుతున్నాయి. మరి బాబు హోదా డిమాండ్ చేస్తాడా? ఇతరత్రా ప్రయోజనాలు సాధించి ఏపీని డెవెలప్ చేయాలని అనుకుంటాడా? అనేది చూడాలి.