వామ్మో జ‌గ‌న్‌.. మంచి కోరి చెబితే చిక్కులే!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌కి ఒక బ‌ల‌హీన‌త వుంది. ఏదీ మ‌న‌సులో దాచుకోర‌ని సొంత పార్టీ నేత‌లు చెబుతున్నారు. జ‌గ‌న్  హితం కోరి, పార్టీలో న‌ష్ట‌ప‌రిచే వారి గురించి చెప్పి, చివ‌రికి చిక్కులు తెచ్చుకున్నామ‌ని…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌కి ఒక బ‌ల‌హీన‌త వుంది. ఏదీ మ‌న‌సులో దాచుకోర‌ని సొంత పార్టీ నేత‌లు చెబుతున్నారు. జ‌గ‌న్  హితం కోరి, పార్టీలో న‌ష్ట‌ప‌రిచే వారి గురించి చెప్పి, చివ‌రికి చిక్కులు తెచ్చుకున్నామ‌ని ఆయ‌న శ్రేయోభిలాషులు వాపోతున్నారు. వైసీపీ కీల‌క నాయ‌కులు ర‌హస్య విష‌యాల్ని జ‌గ‌న్‌తో పంచుకుని, ఆ త‌ర్వాత ఎవ‌రి గురించి చెప్పారో, వారి ఆగ్ర‌హానికి గురైన‌ట్టు క‌థ‌లుక‌థ‌లుగా చెబుతున్నారు.

నాయ‌కుడే ఇలా అయితే, ఇక తామేం చేయాల‌ని వాపోతున్నారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే అభ్య‌ర్థి త‌న ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల్ని జ‌గ‌న్ ఎదుట ఏక‌రువు పెట్టారు. ముఖ్యంగా త‌న‌ను ఓడించేందుకు మాజీ మంత్రి అయిన ఓ “పెద్దాయ‌న” ఏకంగా రూ. 20 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలిసింది. అలా చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని, స‌ద‌రు పెద్దాయ‌న కూడా మంత్రి కావాల‌ని కోరుకుంటారు క‌దా? అని ఆ ఎమ్మెల్యే అభ్య‌ర్థితో అన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ తంతు జ‌గ‌న్‌, స‌ద‌రు ఎమ్మెల్యే అభ్య‌ర్థితో పాటు ఒక‌రిద్ద‌రు నాయ‌కుల స‌మ‌క్షంలో జ‌రిగింది.

సీన్ క‌ట్ చేస్తే… ఆ పెద్దాయ‌న‌కు త‌న‌పై ఫిర్యాదు సంగ‌తి తెలిసిపోయింది. నాలుగు గోడ‌ల మ‌ధ్య‌, న‌లుగురి స‌మ‌క్షంలో జ‌రిగిన అత్యంత ర‌హ‌స్యం గురించి ఎవ‌రు చెప్పార‌య్యా అని ఆరా తీస్తే… జ‌గ‌నే చేర‌వేసిన‌ట్టు ఎమ్మెల్యే అభ్య‌ర్థికి తెలిసింది.

“ఏంట‌న్నా మీరు మ‌న పార్టీ ఓట‌మి కోసం ప‌ని చేశార‌ని ఫిర్యాదు అందింది. కానీ నేను న‌మ్మ‌డం లేదు. జ‌స్ట్ మీ దృష్టికి తెచ్చానంతే. ఫ‌లానా అభ్య‌ర్థే మీపై ఫిర్యాదు చేశాడు” అని చావు క‌బురు చ‌ల్ల‌గా జ‌గ‌నే చెప్పాడ‌ని… స‌ద‌రు పెద్దాయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోతున్నార‌ని స‌మాచారం. పెద్దాయ‌నకు విష‌యం తెలియ‌డంతో ఇక త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ గోవిందా అని స‌ద‌రు అభ్య‌ర్థి అంటున్నారు.

ప్ర‌స్తుతం వైసీపీలో పెద్దాయ‌న్ను జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌డం గురించి తెలిసి… త‌మ నాయ‌కుడితో ఇలాంటి అనుభ‌వాల్ని సీనియ‌ర్ నాయ‌కులు క‌థ‌లుక‌థ‌లుగా చెబుతున్నారు. జ‌గ‌న్‌కు ఏదీ చెప్ప‌కూడ‌ద‌ని, ఒక వేళ ఏదైనా ఆయ‌న చెవిలో వేస్తే, మ‌ళ్లీ వారికి ఆయ‌న ఫ‌లానా వాళ్లు… ఇలా చెప్పారంటూ అమాయ‌కంగా తెలియ‌జేస్తార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. జ‌గ‌న్ మంచి కోరి చెప్పామ‌ని  కొంద‌రు నేత‌లు ర‌హ‌స్యాలు చెప్పి, ఆ త‌ర్వాత అభాసుపాలు కావ‌డం గ‌మ‌నార్హం.