తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లపై భారీ అవినీతి జరిగిందని, నిగ్గు తేల్చేందుకు రేవంత్‌రెడ్డి సర్కార్ జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ విచారణకు ట్రాన్స్‌కో, జెన్‌కో ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇక కేసీఆర్ వంతు వచ్చింది. విచారణకు రావాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు పంపింది. విచారణకు కేసీఆర్ హాజరు కాకపోగా, ఘాటైన లేఖ రాశారు. అసలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు విచారించే అర్హతే లేదని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఎందుకంటే జస్టిస్ నరసింహారెడ్డి మీడియా ముందుకొచ్చి ఏకపక్షంగా మీడియా ఎదుట విద్యుత్ కొనుగోళ్లపై మాట్లాడారని, అలాంటప్పుడు విచారణకు తానెలా హాజరు కావాలని కేసీఆర్ ప్రశ్నించారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ అర్హతపై కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసీఆర్, ప్రభుత్వ తరపు వాదనలు పూర్తయి ఇవాళ తీర్పు వెలువడింది. మీడియా ఎదుట జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా మాట్లాడలేదని, కేసీఆర్ వాదనలో పసలేదని ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్‌రెడ్డి చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. పారదర్శకంగా విచారణ సాగుతోందని, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు కూడా హాజరయ్యారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకెళ్లారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు… కేసీఆర్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు వెలువరించింది. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషఫన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో కేసీఆర్‌కు గట్టి షాక్ తగిలినట్టైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో విచారణకు ఆయన హాజరవుతారా? లేక సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? అనే విషయం తేలాల్సి వుంది.