ఘోరం కదా.. మరణాల సంఖ్యపై డ్రామాలెందుకు?

భక్తుల్లో భయం కలగకుండా ఉండడానికి మరణాల సంఖ్య దాచిపెట్టడం మార్గం కాదు. కొత్తగా ప్రమాదాలు జరగకుండా.. తాము ఏం చర్యలు తీసుకున్నామో వాటిని ప్రభుత్వం బాగా ప్రచారం చేసుకోవడం అవసరం.

ప్రయాగరాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారు ఎందరు? ఈ విషయంపై ఇప్పటిదాకా వాస్తవాల గురించిన అధికారిక ప్రకటన లేనేలేదు. అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో ఘటన జరిగితే.. సాయంత్రం వరకు కూడా అధికారిక ప్రకటన ప్రభుత్వం చేయనేలేదు.

భక్తుల్లో భయాలు పుట్టించే పుకార్లకు అవకాశం ఇవ్వడమే తప్ప దీని వల్ల మరో ఉపయోగం లేదని అంతా అనుకున్నారు. తీరా 30 మంది మరణించినట్టు పొద్దుపోయాక ప్రకటించారు. కానీ వాస్తవంగా 79 మంది మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. మరణాల సంఖ్య విషయంలో ఇంతగా దాగుడుమూతలు ఎందుకు? ప్రజలను తప్పుదోవ పట్టించడం, భక్తులను తప్పుదోవ పట్టించడం భగవంతుడి పట్ల కూడా అపరాధమే కదా అని పలువురు అంటున్నారు.

అప్పటికి సమాచారాన్ని బట్టి 30 మంది మరణినంచినట్టు అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత.. మరో ప్రకటన యూపీ సర్కారు చేయనేలేదు. కానీ.. న్యూస్ లాండ్రీ అనే మీడియా సంస్థ ప్రయాగరాజ్ లోని మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజి, స్వరూపరాణి హాస్పిటల్ సహా నాలుగు ఆస్పత్రుల్లో పరిశీలన జరిపింది. జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 79 అని తేల్చింది.

మోతీలాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో ఓ అధికారి 669 మంది పేర్లతో జాబితాను చూపించి.. వీరందరినీ తొక్కిసలాటలో మరణించిన తర్వాత తీసుకువచ్చారని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మిగిలిన ఆస్పత్రుల్లో కూడా వివరాలు సేకరిస్తే.. మొత్తం మృతుల సంఖ్య 79గా తేలింది.

వివరాలు దాచిపెట్టడం దుర్మార్గమైన చర్యగా ప్రజలు భావిస్తున్నారు. ప్రయాగరాజ్ లో జరిగే కుంభమేళా ఉత్సవాన్ని ఒక వ్యాపారంగా ప్రభుత్వం మార్చివేసిందని.. భక్తుల మరణాల సంఖ్య వాస్తవాలు వెల్లడిస్తే.. కొత్తగా వచ్చేవారి సంఖ్య తగ్గిపోయి వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో ఇలా మోసం చేశారని ఆరోపణలు వస్తున్నాయి.

భక్తుల్లో భయం కలగకుండా ఉండడానికి మరణాల సంఖ్య దాచిపెట్టడం మార్గం కాదు. కొత్తగా ప్రమాదాలు జరగకుండా.. తాము ఏం చర్యలు తీసుకున్నామో వాటిని ప్రభుత్వం బాగా ప్రచారం చేసుకోవడం అవసరం. కానీ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం ఆ పని చేయకుండా.. ప్రజలను మభ్యపెట్టడం పట్ల పలువురిలో అభ్యంతరాలు వస్తున్నాయి.

2 Replies to “ఘోరం కదా.. మరణాల సంఖ్యపై డ్రామాలెందుకు?”

Comments are closed.