తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు నెలల క్రితం వరకూ బీఆర్ఎస్‌కు అనుకూల పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే వాతావరణం ఉండింది. అయితే ఇవన్నీ ఉత్తుత్తిదే అని ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే తెలిసొస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ స్పష్టంగా కనిపించేవి.
ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు మొదలైంది. సీఎం కేసీఆర్ తనయ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేయకపోవడమే ఈ మార్పునకు కారణమైందని చెప్పొచ్చు. కేసీఆర్ సర్కార్‌పై ఇంత వరకూ పైకి కనిపించని వ్యతిరేకత చాపకింద నీరులా ఉంటూ వచ్చింది. అయితే బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదనే ప్రచారాన్ని జనం నమ్ముతూ వచ్చారు. కేసీఆర్ ఆట బీజేపీ కట్టిస్తుందని అనుకుంటే, అందుకు విరుద్ధంగా మద్దతుగా నిలబడిందనే ఆగ్రహం ప్రజానీకంలో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా కాంగ్రెస్ వైపు మళ్లాయి. బీఆర్ఎస్ అంతు చూసే పార్టీ బీజేపీనే అని నమ్మి వెళ్లిన నాయకులంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరడం మొదలైంది. దీంతో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా వ్యవహారం తయారైంది. మొదట బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చర్చ జరిగింది. ఆ తర్వాత నువ్వా, నేనా అన్నట్టు బిగ్ ఫైట్ జరుగుతోందని అన్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని పెద్ద ఎత్తున మౌత్ టాక్ నడుస్తోంది. అంతేకాదు, గజ్వేల్, కామారెడ్డిలలో సీఎం కేసీఆర్, సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపుపై అనూహ్యంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టి బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా పడిపోతూ వస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.
ఎందుకో గానీ తెలంగాణలో ఒక్కసారి కాంగ్రెస్ రావాలని ఆ రాష్ట్రంతో పాటు ఏపీ ప్రజానీకంలో కూడా ఒక బలమైన ఆకాంక్ష వ్యక్తమవుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు తదితర బీఆర్ఎస్ నేతల అహంకారం తెలుగు సమాజం భరించలేనట్టుగా క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. అయితే పైకి కనిపించేదే నిజమని విశ్వసించలేం. డిసెంబర్ 3న ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి.