తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడింది. ఇక రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. ప్రజల ఆదరణ పొందేందుకు ఈ తక్కువ సమయమే అత్యంత విలువైనదిగా నాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు చెప్పడం విశేషం. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన పార్టీ నాయకులతో మాట్లాడిన ఆడియో లీక్ అయ్యింది.
ఈ ఆడియోలో కేటీఆర్ మాటలు వింటే… ఆయనలో గెలుపు భయాన్ని చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిరిసిల్ల మున్సిపల్ కార్పొరేషన్‌లోని తన పార్టీ వార్డు సభ్యులు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లతో మాట్లాడినట్టు ఆయన చెప్పారు. తమ పంచాయతీలో, అలాగే వార్డుల్లో అంతా అద్భుతంగా వుందని, పక్క ప్రాంతాల్లోనే ఏదో తేడా కొడుతున్నట్టు చెబుతున్న విషయాన్ని ఆయన బయట పెట్టారు. రెడ్లతో పాటు కొన్ని సామాజిక వర్గాలు బీఆర్ఎస్‌కు ఓట్లు వేయరనే ప్రచారాన్ని తన దృష్టికి తెచ్చారని కేటీఆర్ అన్నారు.
ఇదంతా కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్‌గా ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డి ప్రతి గడప తొక్కుతాడని, ఆయనకు అంత సీన్ లేదని మంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రచారానికి భయపడొద్దని, ప్రతి గడపకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో వారంలో రెండుసార్లు సిరిసిల్లకు వస్తానని ఆయనలోని భయాన్ని బయట పెట్టిందనే చర్చకు తెరలేచింది. గతంలో మాదిరిగా వుండనని ఆయన చెప్పడం గమనార్హం.
సోషల్ మీడియాలో తన ఓటమిపై జరుగుతున్న ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని కేటీఆర్ పదేపదే తన శ్రేణులకు విజ్ఞప్తి చేయడం విశేషం. అధికార పార్టీ నాయకుల మాటల్లో గతంలో ఎప్పుడూ లేని ఆందోళన కనిపిస్తోందన్నది వాస్తవం. దీన్నిబట్టి క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతోందన్న అనుమానం అంతకంతకూ పెరుగుతోంది.