భారత్ జట్టుకు విశాఖ సెంటిమెంట్

విశాఖలో టీ 20 మ్యాచ్ కి రంగం సిద్ధం అయింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాల‌ మ్యాచ్ జరగనుంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం గుజరాత్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్ వన్డే ఫైనల్స్…

విశాఖలో టీ 20 మ్యాచ్ కి రంగం సిద్ధం అయింది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియాల‌ మ్యాచ్ జరగనుంది. సరిగ్గా నాలుగు రోజుల క్రితం గుజరాత్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్ వన్డే ఫైనల్స్ లో తలపడ్డాయి. చివరికి భారత్ ఆశలు నీరు కోరి ఓటమి పలుకరించింది.

ఇది జరిగిన వెంటేనే విశాఖలో భారత్ ఆస్ట్రేలియా జట్లు మరో పోరుకు తెర తీశాయి. భారత్ ఓటమితో దిగాలు పడిన క్రికెట్ అభిమానులు అంతా ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తీర్చుకోమంటున్నారు. చెల్లుకు చెల్లు చేసి భారత్ కి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. విశాఖతో భారత్ జట్టుకు సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గతంలో మూడు టీ 20 మ్యాచులు జరిగితే అందులో రెండు భారత్ జట్టు గెలిచింది. 2016 లో శ్రీలంకతో, 2022లో దక్షిణాఫ్రికా పైన భారత్ జట్టు గెలిచింది.

అయితే 2019లో ఇదే ఆస్ట్రేలియాతో భారత్ విశాఖ వేదికగా ఆడిన టీ 20 మ్యాచ్ లో ఓడింది. ఇప్పుడు చూస్తే భారత్ జట్టు మీద వరల్డ్ కప్ గెలిచి ఆస్ట్రేలియా మంచి జోరు మీద ఉంది. భారత్ లో కసి రేగితే మాత్రం విశాఖ సెంటిమెంట్ తోడు అయి ఈ మ్యాచ్ భారత్ పరం అవుతుంది అని అంటున్నారు. అలాగే జరగాలని అంతా ఆశిస్తున్నారు.

భారత్ జట్టు విజయం కోసం ఆటగాళ్ళు అంతా ఉత్తరాంధ్రలోని అతి పెద్ద నారసింహ క్షేత్రం అయిన సింహాచలంలో అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. విజయం అందించాలని స్వామిని ప్రార్ధించారు. భారత్ గెలవాలని అంతా కోరుకుంటున్న తరుణం ఇది. ఆ మీదట ఏమి జరుగుతుంది అన్నది ఆటలోనే తేలనుంది.