మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. దాదాపు మూడు నెలల పాటు అవిశ్రాంతంగా సీబీఐ దర్యాప్తు సాగించింది.
కడప, పులివెందుల కేంద్రాలుగా పలువురు సాక్ష్యులను సీబీఐ అధికారులు లోతుగా విచారించారు. విచారణలో భాగంగా సునీల్‌యాదవ్‌తో పాటు ఒకరిద్దర్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వివేకా హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో నలుగురు నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. టి.గంగిరెడ్డి, వై.సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరి అనే నలుగురు నిందితులపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేయడం గమనార్హం.
కడప నుంచి పులివెందుల కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ సందర్భంగా ఐదారు సంచుల్లో కేసుకు సంబంధించిన డాక్యు మెంట్స్ కోర్టులో సమర్పించారు. అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత పేర్కొన్న అనుమానితుల పేర్లు ఇందులో లేవనే చర్చ జరుగుతోంది. తాజా చార్జిషీట్‌పై వివేకా కుటుంబ సభ్యుల స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.