ఏపీలో పర్యటిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒక మంచి మాట సెలవిచ్చారు. అది రాజకీయ పార్టీలకూ, రాజకీయ నాయకులకూ! ప్రత్యేకించి వెంకయ్య చెప్పిన మంచి మాటల్లో.. ముఖ్యమైనది ఎన్నికల హామీల గురించి. 'రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి..' అని అంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు.
నిజమే కదా.. ఏ పార్టీ అయినా ఆచరణ సాధ్యమైన హామీలే ఇవ్వాలి. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ఇది ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్యనాయుడు చెప్పదలుచుకున్నది.
ఈ మంచిమాట విన్నాకా.. కొన్ని అంశాలు లీలగా మెదలాడుతాయి. అవి 2014 ఎన్నికల ప్రచారపు రోజులు. ఆ సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఏపీలో పర్యటిస్తూ కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను తెలుగులోకి అనువదించడమే కాదు, పలు ఎన్నికల ప్రచార సభల్లో.. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఒక కీలకమైన హామీని ఇచ్చారు.
బీజేపీ ఎన్ని హామీలు ఇచ్చి ఉన్నా… ఒక విషయం మాత్రం ఆంధ్రులు ఎప్పటికీ మరిచిపోరు. అదే ప్రత్యేక హోదా. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేస్తూ.. ఏపీకి ప్రత్యేకహోదా అనే హామీని లెక్కకు మించినన్ని సార్లు చెప్పారు. ప్రత్యేకించి వెంకయ్యనాయుడే ఆ హామీని అనేక సార్లు ప్రస్తావించారు.
కేంద్రంలో బీజేపీని, ఏపీలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే.. విభజిత ఏపీకి ఐదు కాదు, పది కాదు, పదిహేనేళ్ల పాటు ప్రత్యేకహోదాను ఇస్తామంటూ వెంకయ్యనాయుడు స్వయంగా హామీ ఇచ్చారు. ప్రజలైతే వెంకయ్య కోరినట్టుగా చేశారు కానీ బీజేపీ మాట నిలబెట్టుకోలేదు.
రాజకీయ నేతలు, హామీల విషయంలో వెంకయ్యనాయుడు ఇప్పుడు స్పందిస్తున్న తీరును గమనించాకా.. ప్రత్యేకహోదా హామీ, ఆ హామీ విషయంలో వెంకయ్య స్వయంగా వల్లెవేసిన డైలాగులు గుర్తురావడం విచిత్రం అయితే కాదు!