ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ విషయం ఆయనకే తెలియదు కాబట్టి. ఏరికోరి చీఫ్ సెక్రటరీగా కొనసాగించిన ఎల్వీ సుబ్రమణ్యాన్ని రాత్రికే రాత్రే చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తప్పించి అందర్నీ షాక్‌కు గురి చేశారు.
అంత వరకూ ఎల్వీ అన్నా అని ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చిన జగన్… ఆయన్ను ఏ మాత్రం ప్రాధాన్యం లేని బాపట్లలోని మానవ వనరుల కేంద్రానికి డైరెక్టర్ జనరల్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. తనస్థాయికి అది చాలా చిన్న పోస్టు అని భావించిన ఎల్వీ అక్కడ చేరలేదు. సెలవులో కొనసాగుతూ చివరికి అవమానకర రీతిలో పదవీ విరమణ చేయాల్సి వచ్చింది.
రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయ కీలక అధికారి ప్రవీణ్‌ప్రకాశ్‌పై కూడా బదిలీ వేటు పడింది. సీఎం ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ)గా ….సీఎం కార్యాలయంలో అంతా తానై ఓ వెలుగు వెలిగిన ప్రవీణ్ “ప్రకాశం” మూణ్నాళ్ల ముచ్చటే అని నిర్ధారణ అయ్యింది. ప్రవీణ్‌ను ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమించారు. ఎక్కడి నుంచి వచ్చాడో, చివరికి అక్కడికే వెళ్లాల్సి వచ్చింది.
తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆకస్మిక మార్పు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనసు మెప్పించడానికి సవాంగ్ అన్ని రకాల పరిధులు దాటారనే విమర్శలు ఎదుర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించి కేసుల నమోదుకు సంబంధించి హైకోర్టులో చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చింది. కేవలం జగన్ కోసం అవమానాల్ని దిగమింగుకున్నారు. చివరికి ఏమైంది… కనీసం పోస్టింగ్‌కు కూడా నోచుకోని దయనీయ స్థితి. జీఏడీలో రిపోర్టు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు.
ఈ మూడు ఎపిసోడ్ల నుంచి ఎవరైనా తెలుసుకోవాల్సిన నీతి, గుణపాఠం ఏంటంటే… జగన్ ప్రభుత్వంలో ఎవరూ తోపులు కాదని. జగన్ ప్రేమాభిమానాలు తాత్కాలికమే అని గ్రహించాలి. తన ప్రయోజనాలు నెరవేర్చడానికి పనిరారనుకుంటే ఉన్నతాధికారులే కాదు రాజకీయంగా కూడా ఎవరినైనా దూరం పెట్టడానికి జగన్ వెనుకాడరు. ఈ విషయంలో జగన్ చాలా స్పష్టంగా ఉంటారు. అయితే జగన్‌ను అర్థం చేసుకోవడంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులే తప్పులు చేస్తూ, ఆ తర్వాత పశ్చాత్తాపం చెందడమే లేక విమర్శిస్తూ కాలం గడుపుతుంటారు.
తాము తమలా కాకుండా, జగన్ కోసం మరో రకంగా ప్రవర్తిస్తుంటారు. అందుకే జగన్ ఆశీస్సుల విషయంలో అతిగా ఊహించుకుని రెచ్చిపోతే, చివరికి అత్యంత అవమానకరరీతిలో నిష్క్రమించాల్సి వుంటుంది. కావున జగన్ విషయంలో ఎవరైనా ఆచితూచి వ్యవహరిస్తే, అది వారి మనసుకు, ఆరోగ్యానికే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.